మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయనకు లాంఛనంగా పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ ఉదయం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న కృష్ణప్రసాద్‌కు చంద్రబాబు పార్టీ కండువా కప్పి లాంఛనంగా టీడీపీలోకి స్వాగతం పలికారు. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ... అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ ప్రాధాన్యం ఇస్తూ... ఏపీని ప్రగతి మార్గంలో నడిపించే సత్తా ఒక్క చంద్రబాబు గారికే ఉందని అన్నారు
మరోవైపు వైసీపీ చీఫ్, ముఖ్యమంత్రి జగన్‌పై కృష్ణప్రసాద్ ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి రాజధాని విషయంలో జగన్ మాట తప్పారని, ప్రతిపక్ష నేతలను విమర్శించిన వారికే వైసీపీలో పదవులు ఇచ్చారని ఆరోపించారు.
మైలవరం టిక్కెట్టుపై వైసీపీ హామీ ఇచ్చినా చంద్రబాబు, లోకేష్‌లపై వ్యక్తిగతంగా దాడి చేయాలని కోరడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీలో ఉండలేకపోవడం వల్లే టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. దేవినేని ఉమాపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషాలు లేవని, కలిసి పని చేసే విషయాలపై ఇద్దరూ చర్చించుకున్నామని కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే దేవినేని ఉమాకు అనుకున్న మైలవరం ఎమ్మెల్యే టిక్కెట్టును చంద్రబాబు వసంత కృష్ణ ప్రసాద్‌కు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.