పవన్ కళ్యాణ్‌పై పేర్ని నాని, మంత్రి రోజా విమర్శలు

YSRCP Leaders Fire On Pawan Kalyan. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు.

By Medi Samrat
Published on : 27 Nov 2022 8:30 PM IST

పవన్ కళ్యాణ్‌పై పేర్ని నాని, మంత్రి రోజా విమర్శలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ప్రతి ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ స్లోగన్ ఒకటే జగన్‌ను గెలవనీయం అంటాడని.. మమ్మల్ని గెలిపించేది, ఓడించేది ప్రజలు అని.. అసలు పవన్ కళ్యాణ్ ఎవరు అని ప్రశ్నించారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమే తమపై పవన్ విమర్శలు చేశారని.. జగన్‌పై విద్వేషం తప్ప పవన్ ప్రసంగంలో ఏమీ లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చుతానని పవన్ పదే పదే అంటున్నాడని.. పవన్‌ను నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని అన్నారు పేర్ని నాని. ప్రధాని మోదీని వైజాగ్‌లో కలిసొచ్చిన తర్వాత.. 2014 తర్వాత ప్రధానిని కలిసి 8 ఏళ్ళు అయ్యిందని పవన్ కళ్యాణ్ చెప్పాడని.. ఇవాళేమో 2014 తర్వాత వివిధ సందర్భాల్లో ప్రధానిని కలిశానంటాడని.. అసలు ఏది నిజమని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. మోదీతో ఏం మాట్లాడావో అని టెన్షన్ పడుతున్న చంద్రబాబుకు చెవిలో చెప్పాలని పవన్‌కు హితవు పలికారు. చంద్రబాబు, పవన్ కలిసి ఏం మాట్లాడుకున్నా, కలిసి దొర్లినా తమకేం ఇబ్బంది లేదన్నారు. 2014లో వైసీపీకి 60 సీట్లు, 2019లో 151 సీట్లు వస్తే పవన్ కళ్యాణ్ నోట్లో వేలు పెట్టుకుని చూశాడని.. అలాగే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు వచ్చినా నోట్లో వేలు పెట్టుకుని చూడక తప్పదన్నారు. జనసేన కార్యకర్తల కష్టాలు పగవారికి కూడా రాకూడదన్నారు.

మంత్రి రోజా కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. పవన్‌ను చంద్రబాబు ఫూల్‌ను చేస్తున్నారని రోజా ఆరోపించారు. ఉనికి కోసమే పవన్ పాకులాడుతున్నారని.. దమ్ముంటే 175 స్థానాల్లో జనసేన అభ్యర్థుల్ని పోటీ చేయించాలని సవాల్ విసిరారు. పిచ్చి పిచ్చి మాట్లాడేవాళ్లకు ప్రజలు ఓట్లు వేయరన్నారు. అందుకే గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారని రోజా విమర్శించారు.


Next Story