పీసీసీ చీఫ్ షర్మిల ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగా మాట్లాడాలని, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడకూడదని వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఆమెను మీరు గుర్తిస్తున్నారేమో కానీ, తాము మాత్రం గుర్తించడం లేదని చెప్పారు. పీసీసీ చీఫ్ గా పలు అంశాలపై మాట్లాడాలని, గతంలో తాను కూడా పీసీసీ అధ్యక్షుడిగా పని చేశానన్నారు బొత్స.
కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం స్మగ్లింగ్ అవుతోందని పవన్ కళ్యాణ్ అంటున్నారని, స్మగ్లింగ్ చేస్తున్న వాళ్లపై చర్యలు తీసుకోవద్దని ఎవరన్నారని బొత్స ప్రశ్నించారు. మంత్రి ప్రమేయం లేకుండానే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయా? అని ప్రశ్నించారు. పవన్ చిత్తశుద్ధిని తాను శంకించడం లేదని, 2004లో మంత్రి అయినప్పుడు తనకు ఎన్నో అధికారాలు ఉంటాయని భ్రమ పడ్డానని, ఆ తర్వాత రియాలిటీ ఏమిటో తెలిసిందన్నారు.
ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని, యూనిట్ కు రూ. 1.20 పైంచారని బొత్స విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలపై అప్పుల భారాన్ని పెంచుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని కూటమి ప్రభుత్వం గత 6 నెలల్లో చేసిన రూ. 70 వేల కోట్ల అప్పులు ఎక్కడికి పోయాయని విమర్శించారు.