'మంత్రి లోకేష్ ఏది చెప్తే.. అది చేస్తారా?'.. అంబటి రాంబాబు ఫైర్
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలు అడ్డుకునేందుకే పోలీసులు ఉన్నారా? అని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు.
By అంజి
'మంత్రి లోకేష్ ఏది చెప్తే.. అది చేస్తారా?'.. అంబటి రాంబాబు ఫైర్
అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలు అడ్డుకునేందుకే పోలీసులు ఉన్నారా? అని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. జగన్ మీటింగ్‌కు వెళ్తే మర్డర్ కేసులు, రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని బెదిరించడం దారుణమని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ ఏది చెప్తే అది చేస్తారా? అంటూ ప్రశ్నించారు. జగన్ పర్యటనలను వివాదాస్పదం చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. జగన్ వస్తే జనం వస్తున్నారని, అది ఆయనకు దేవుడు ఇచ్చిన వరమని అన్నారు.
పోలీసుల అణచివేతతో జగన్ పర్యటను అడ్డుకోలేరని అంబటి అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను పెంచుకుంటోందని అన్నారు. వైఎస్ జగన్ మాజీ సీఎం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మంత్రి అంబటి హెచ్చరించారు. ప్రజల ప్రవాహాన్ని ఆపలేరు అంటూ వ్యాఖ్యానించారు. ఐపీఎస్ అన్న విషయాన్ని మరచి కొందరు పోలీసులు పని చేస్తున్నారని మంత్రి అంబటి విమర్శించారు.
అటు వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బాంగారుపాళ్యం పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ఆయనను చూసేందుకు తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపు చేస్తుండగా పలువురు గాయపడ్డారు. కార్యకర్తలు గాయపడ్డారని తెలిసి కారు దిగేందుకు జగన్ యత్నించగా, ఎస్పీ అడ్డుకున్నారు. కాన్వాయ్‌లోనే వెళ్లాలని సూచించారు. పోలీసుల ఆంక్షలకు మించి వైసీపీ కార్యకర్తలు జగన్ పర్యటనకు తరలివచ్చారు.
బంగారు పాళ్యంలో మామిడి రైతుల పరామర్శ పేరిట చేపట్టిన ఈవెంట్ పాలిటిక్స్ లో వైసీపీ నేతల వికృత చర్యలు అంటూ తెలుగు దేశం పార్టీ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. మార్కెట్ లో అమ్మాల్సిన మామిడి కాయలను తెచ్చి రోడ్డుపై కాన్వాయ్ ముందు పోసి డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యింది. జగన్ వచ్చిన సమయంలో రోడ్డుపై పంటను పారబోసి ఆ దృశ్యాల ద్వారా తప్పుడు ప్రచారం చేసేందుకు ఈవెంట్ ప్లానింగ్ చేశారని, తమను ఎవరూ పట్టించుకోలేదని అని జగన్ కు రైతులు చెప్పినట్లుగా చిత్రీకరించడానికి స్క్రిప్ట్ ప్రకారం రోడ్డుపై మామిడి పంట వేశారని పేర్కొంది. పర్యటను ప్రచారం కోసం వైసీపీ చేపట్టిన ఈవెంట్ పాలిటిక్స్ పై టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది.