నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్ కాలేజీలో ఈరోజు(ఆదివారం) ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయగా.. 20 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికల పరిశీలకులు సురేశ్‌కుమార్, రిటర్నింగ్ అధికారి హరేంధిర ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నాం 1 గంట వరకు తుది ఫలితం తేలనుంది.
ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తి అయ్యాయి. మొదటి రౌండ్ నుంచి అధికార వైసీపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెలుతోంది. నాలుగో రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి 17,385 ఓట్ల మెజారీటి వచ్చింది. ఇప్పటివరకు ఆయనకు 21,043 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌కు 3,658 ఓట్లురాగా, బీఎస్పీ అభ్యర్థి 683, నోటాకు 699 ఓట్లు పోలయ్యాయి. కాగా.. విక్రమ్ రెడ్డి ఆధిక్యం భారీగా ఉండటంతో బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్ కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు.
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 23న ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక జరిగింది. మొత్తం 2,13,338 ఓట్లు ఉండగా.. 1,37,081 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ ఓట్లు 493 ఉన్నాయి.