Ys Viveka Murder Case: ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు
By అంజి
Ys Viveka Murder Case: ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు ఈరోజు ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు, పులివెందులకు చెందిన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తండ్రి జయప్రకాశ్ రెడ్డి, న్యాయవాది సమక్షంలో ఉదయ్‌కుమార్ అరెస్ట్ జరిగింది. అరెస్ట్‌కు సంబంధించిన మెమోను ఉదయ్ కుటుంబ సభ్యులకు సీబీఐ అందించింది. కాగా తనను వేధించారంటూ సీబీఐ మాజీ ఎస్పీ రామ్ సింగ్ పై ఉదయ్ కుమార్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ కౌంటర్‌లో ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రకాష్ రెడ్డిల వ్యవహారాన్ని కూడా సీబీఐ వెల్లడించింది.
వివేకా హత్య జరిగిన రోజు అవినాష్, శివశంకర్‍తో పాటు ఘటనాస్థలికి ఉదయ్ వెళ్లినట్లు గుర్తించింది. వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి సాక్ష్యాధారాలను మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఉదయ్‌కుమార్‌రెడ్డిని కడప నుంచి హైదరాబాద్‌కు తరలించిన అధికారులు, హైదరాబాద్‌లోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. తాజాగా ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఏమి జరుగుతుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ నెలాఖరులోగా సిబిఐ దర్యాప్తును ముగించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.