వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మికి ప్రమాదం తప్పింది.
By Medi Samrat Published on 13 Oct 2023 8:16 PM ISTవైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మికి ప్రమాదం తప్పింది. శుక్రవారం నాడు హైదరాబాద్ నుంచి ఒంగోలు బయల్దేరారు. మార్గమధ్యంలోని సంతమంగలూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. విజయమ్మ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనుక వేగంగా వస్తున్న కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం దెబ్బతిన్నది. అయితే విజయమ్మకు గానీ.. కార్లలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు గానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం అదే కారులోనే ఆమె ఒంగోలు చేరుకున్నారు.
వైఎస్ విజయలక్ష్మి ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి వైఎస్ఆర్టీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాను పాలేరుతో పాటు మరో నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నట్లు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రకటన చేశారు. తన తల్లి విజయమ్మ, భర్త బ్రదర్ అనిల్ కుమార్‌ను కూడా పోటీచేయించాలని పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి ఉందని షర్మిల తెలిపారు. విజయమ్మ ఎక్కడ నుండి పోటీ చేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది.