ఓ వైపు ఎంక్వయిరీ.. ఇంతలో పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్ సునీత
YS Sunitha Wrote Letter To Kadapa SP. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 13 Aug 2021 12:01 PM GMTమాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇంతలో ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ కడప జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ఎస్పీ లేకపోవడంతో లేఖను కార్యాలయ సిబ్బందికి అందించారు. ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 5.10 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటి చుట్టూ తిరిగాడని, అదే సమయంలో కొన్ని ఫోన్ కాల్స్ కూడా చేశాడని సునీత లేఖలో వెల్లడించారు. అతడు వివేకా హత్య కేసు అనుమానితుడు శివశంకర్ రెడ్డి పుట్టినరోజున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఉన్న మణికంఠరెడ్డి అనే వ్యక్తిలాగే ఉన్నాడని ఆమె తెలిపారు. ఈ విషయమై ఆగస్టు 12న సీఐ భాస్కర్ రెడ్డికి ఫిర్యాదు చేశానని తెలిపారు. తమ కుటుంబ భద్రత పట్ల ఆందోళన కలుగుతోందని అన్నారు. వివేకా హత్య జరిగిన తర్వాత డాక్టర్ సునీతారెడ్డి 15 మంది అనుమానితుల పేర్లను అధికారులకు అందించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వేగవంతం చేసింది. పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో 68వ రోజు విచారణ కొనసాగింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్ రెడ్డి హాజరయ్యారు. వివేకా హత్య కేసులో శంకర్ రెడ్డి అనుమానితుడిగా ఉన్నారు. ఆయనతో పాటు పులివెందుల క్యాంప్ ఆఫీసులో పనిచేసే రఘునాథరెడ్డి అనే వ్యక్తి కూడా విచారణకు వచ్చారు. వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి, పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాను కూడా ప్రశ్నించారు. వైఎస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (ఏఎఫ్‌యూ) రిజిస్ట్రార్, ఈసీ గంగిరెడ్డి బంధువు సురేంద్రనాథ్‌రెడ్డిని ప్రశ్నించింది. వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి వుంటే సాధారణ మరణమని ఎలా అనుకున్నారని అధికారులు ప్రశ్నించగా కంగారులో సరిగా గుర్తించలేకపోయినట్టు ఆయన బదులిచ్చినట్టు సమాచారం. సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్ కుమార్ యాదవ్, మాజీ డ్రైవర్ దస్తగిరిని కారులో ఎక్కించుకుని వివేకా ఇంటికి తీసుకెళ్లిన అధికారులు అక్కడి ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.