మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఏపీ అసెంబ్లీకి వెళ్లారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో ఆమె భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసు గురించి ఆమెతో చర్చించారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి, జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. అనంతరం సీఎంఓ అధికారులను కూడా ఆమె కలిశారు. తన తండ్రి హత్య కేసులో పురోగతిపై చర్చించారు. కేసు పురోగతికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇటీవల మరో నిందితుడికి బెయిల్ వచ్చింది. హత్య కేసులో ఏ3 నిందితుడైన గజ్జల ఉమాశంకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం పులివెందుల సీఐ ఎదుట హాజరుకావాలని షరతులు విధించింది. ఉమాశంకర్‌రెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.