గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట..కూటమి పాలనపై షర్మిల నిప్పులు!
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
By - Knakam Karthik |
గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట..కూటమి పాలనపై షర్మిల నిప్పులు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగం అంతా డొల్ల అని, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అందులో ఎటువంటి దశ-దిశ లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే గవర్నర్‌తో అవాస్తవాలు చెప్పించిందని మండిపడ్డారు. ఎన్నికల మ్యానిఫెస్టోకు మెరుగులు అద్ది గవర్నర్‌తో చదివించారని షర్మిల ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న 'సూపర్ సిక్స్' పథకాలు క్షేత్రస్థాయిలో అట్టర్ ప్లాఫ్ అయ్యాయని ఆమె విమర్శించారు. నెలకు రూ. 3 వేలు ఇస్తామన్న హామీ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. 40 లక్షల మంది రైతులకు ఈ పథకం కింద టోకరా వేశారని ఆరోపించారు. 20 లక్షల మంది విద్యార్థులకు మొండిచేయి చూపారని మండిపడ్డారు.
మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ!
నిరుద్యోగుల ఆశలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీని 'దగా డీఎస్సీ'గా మార్చారని, జాబ్ క్యాలెండర్ రాకపోయినా 20 లక్షల ఉద్యోగాలంటూ అభూత కల్పనలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కోటి మంది మహిళలకు నెలకు రూ. 1500 ఇచ్చే 'ఆడబిడ్డ' పథకానికి దిక్కులేదు కానీ, మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తామనడం హాస్యాస్పదమన్నారు.
వైద్యం అందని ద్రాక్ష.. పోలవరం నిర్జీవం
యూనివర్సల్ హెల్త్ పాలసీ పేరుతో సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని చంపేశారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల 1.43 కోట్ల కుటుంబాలకు వైద్యం అందకుండా పోయిందన్నారు. అలాగే, పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి రాష్ట్ర జీవనాడిలో జీవం తీశారని విమర్శించారు. అమరావతి చట్టబద్ధతపై చేస్తున్నవి డ్రామాలు తప్ప, చేతలు లేవని ఎద్దేవా చేశారు.
కరెంటు భారం.. ఉపాధి హామీపై జోకులు!
ట్రూ అప్ పేరుతో రూ. 15 వేల కోట్ల భారం మోపి, ట్రూ డౌన్ పేరుతో రూ. 4 వేల కోట్లు తగ్గించి ఉద్ధరించామని చెప్పడం సిగ్గుచేటన్నారు. "రాష్ట్రంలో సగటున 52 రోజుల పనికి దిక్కులేదు కానీ, 125 రోజుల ఉపాధి కల్పిస్తామనడం ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్" అని షర్మిల వ్యాఖ్యానించారు. టమాటో, ఉల్లి రైతులు కిలో రూపాయికి అమ్ముకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం, మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ఆదుకున్నామని చెప్పడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వానికి విజన్ లేదు, విజ్డం లేదని షర్మిల ఘాటుగా విమర్శించారు. కేవలం పునర్ నిర్మాణం పేరుతో పబ్బం గడుపుకుంటున్నారని, క్షేత్రస్థాయిలో పాలన వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆమె స్పష్టం చేశారు.
గవర్నర్ గారి బడ్జెట్ ప్రసంగం అంత డొల్ల. రాష్ట్ర అభివృద్ధిపై దశ - దిశ లేదు. అంతా అవాస్తవాలు..కల్పితాలు. ఎన్నికల మ్యానిఫెస్టోకు మెరుగులద్ది చదివినట్లుంది. 19 నెలల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం. పాలన తీరుపై గవర్నర్ గారితో చెప్పించినవి పచ్చి అబద్ధాలు. పునర్ నిర్మాణం పేరుతో…
— YS Sharmila (@realyssharmila) February 11, 2026