పక్కా ప్లాన్‌తోనే హత్య చేశారు..పాస్టర్ ప్రవీణ్ మృతిపై షర్మిల ట్వీట్

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు.

By Knakam Karthik
Published on : 27 March 2025 11:26 AM IST

Andrapradesh, YS Sharmila, Pastor Praveens Suspicious Death, CM Chandrababu

పక్కా ప్లాన్‌తోనే హత్య చేశారు..పాస్టర్ ప్రవీణ్ మృతిపై షర్మిల ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌లో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం అనుమానాలకు దారి తీసింది. మొదట ఆయన బైక్ ప్రమాదంలో చనిపోయారని భావించారు. కానీ ఆయన శరీరంపై గాయాలు కనిపించాయని ఆయన అనుచరులు సందేహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. ఆమె ఇలా రాసుకొచ్చారు.. పాస్టర్ ప్రవీణ్‌ది రోడ్డు ప్రమాదం కాదని, అది హత్య అనేందుకు చాలా రుజువులు ఉన్నాయని కామెంట్ చేశారు.

ముమ్మాటికీ ఇది పక్కా ప్లాన్‌తో చేసిన హత్యేనని వారి కుటుంబ సభ్యులతో అందరికీ ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రిస్టియన్ల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం ప్రవీణ్ పగడాల మృతిపై వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని, నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.

ప్రవీణ్ మృతిపై ఏం జరిగింది?

ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. దివాన్ చెరువు-కొంతమూరు రహదారి సమీపంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. రాజమహేంద్రవరంలో స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని భార్యకు చెప్పి బుల్లెట్‌పై బయలుదేరినట్లు సమాచారం. ఈ క్రమంలో రోడ్డు పక్కన చనిపోయి ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బుల్లెట్‌తో సహా ప్రవీణ్ రహదారి పై నుంచి కిందకు జారీపోయాడని.. ఈ క్రమంలో బుల్లెట్ ఆయనపై పడటంతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కానీ ప్రవీణ్ మృతదేహాన్ని చూసిన వారు మాత్రం అతడిని ఎవరో చంపి పడేశారని.. ప్రవీణ్ ఒంటిపై గాయాలు ఉన్నాయని... రాడ్డుతో కొట్టినట్టు కనిపిస్తోందని చెబుతున్నారు. అయితే ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రవీణ్ మృతి విషయం తెలిసిన వెంటనే క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు ఆందోళనకు దిగారు. ప్రవీణ్‌ను ఆయన ప్రత్యర్థులు ఎవరో చంపేశారంటూ నిన్న రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్ద నిరసన చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. ఇదే విషయమై ఆయన డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కూడా మాట్లాడారు.

Next Story