ఆ పార్టీకి సీఎం జగన్ బానిసలా మారిపోయారు : వైఎస్ షర్మిల

సీఎం జగన్ బీజేపీకి బానిసలా మారిపోయారంటూ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on  26 Jan 2024 3:49 PM GMT
ఆ పార్టీకి సీఎం జగన్ బానిసలా మారిపోయారు : వైఎస్ షర్మిల

సీఎం జగన్ బీజేపీకి బానిసలా మారిపోయారంటూ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ, బీజేపీకి వైసీపీ ఊడిగం చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకే సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదని.. సీఎం జగన్ పెద్ద పెద్ద గోడలు కట్టుకుని కోట లోపల ఉన్నారని విమర్శించారు. గుంటూరులోని మెట్టు అంజిరెడ్డి కల్యాణ మండపంలో కాంగ్రెస్ నేతల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ ఐదేళ్లలో ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? అని షర్మిల వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల వేళ జాబ్ నోటిఫికేషన్ ఇస్తే ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. జీతాలు ఇచ్చేందుకే డబ్బులు లేవు.. అభివృద్ధికి ఎక్కడ్నించి వస్తాయని వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. స్వలాభం కోసం ఏపీ నేతలు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి..బీజేపీకి బీ టీంలా మారారని విమర్శించారు షర్మిల. ఒక్క సీటు లేని బీజేపీ రాష్ట్రాన్ని శాసిస్తుందన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. పోలవరం పూర్తి చేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాహుల్ గాంధీ ఇప్పటికే తొలి సంతకం హామీ ఇచ్చారని చెప్పారు. వైఎస్సార్ పాలనకు, జగన్ పాలనకు భూమికి ,ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నారు షర్మిల. వైఎస్సార్ హయాంలో రైతు రారాజు.. ఇపుడు జగన్ హయాంలో వ్యవసాయం దండుగ అన్నట్లు తయారయ్యిందన్నారు.

Next Story