ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ.. ఇప్పుడు యావత్ డ్రగ్స్ సప్లై చేసే.. డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు. గంజా, హెరాయిన్, కొకైన్ ఏది కావాలంటే అది దొరికే.. ఉడ్తా ఆంధ్రప్రదేశ్ అని వ్యాఖ్యానించారు. ఇండియాలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపీ వైపే ఉన్నాయంటూ ఆమె ధ్వజమెత్తారు. మొదటి 5 ఏళ్లు TDP, తర్వాత 5 ఏళ్లు YCP.. ఈ 10 ఏళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా మార్చేశారు. డ్రగ్స్ రవాణా, వాడకంలో నెంబర్ 1 ముద్ర వేశారని మండిపడ్డారు. 25 వేల కేజీల భారీ మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే.. తమ తప్పు ఏమీ లేదని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీలకు సిగ్గుండాలన్నారు.
కేంద్ర, రాష్ట్రాల నిఘా వ్యవస్థ సపోర్ట్ లేకుండా.. వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరుతాయి.? అని ప్రశ్నించారు. డ్రగ్స్ మాఫియాతో మీకు లింకులు లేకుంటే.. ఇది సాధ్యమయ్యే పనేనా.? అని నిలదీశారు. మీ అండదండలతోనే కదా డ్రగ్స్ రవాణాలో ఏపీ "సేఫ్ హెవెన్" గా మార్చింది? తెర వెనుక ఎంతటి వాళ్లున్నా నిజాలు నిగ్గు తేల్చాలని CBI ని కోరారు. ఆసియాలోనే అతి పెద్ద డ్రగ్ డీల్ గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు.. పారదర్శక విచారణ కోసం.. సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.