అన్నను కలిసిన వైఎస్ షర్మిల
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన సోదరి వైఎస్ షర్మిల కలిశారు.
By Medi Samrat Published on 3 Jan 2024 7:01 PM IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన సోదరి వైఎస్ షర్మిల కలిశారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన షర్మిల.. కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి రావాలని కోరారు. అన్న జగన్, వదిన భారతికి శుభలేఖ ఇచ్చారు.తన కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియకు ఫిబ్రవరి 17న వివాహం ఫిక్స్ అయిందని కుటుంబ సమేతంగా హాజరుకావాలని జగన్‌ను వైఎస్ షర్మిల ఆహ్వానించారు. అలాగే ఈ నెల 18న జరిగే ఎంగేజ్‌మెంట్ కార్యక్రమానికి సైతం రావాలని షర్మిల కోరారు. దాదాపు అరగంట పాటు మాట్లాడారు. భేటీ అనంతరం తాడేపల్లి నుంచి నోవాటెల్ హోటల్‌కు బయలుదేరారు.
తాడేపల్లిలో చాలా కాలం తర్వాత అన్న జగన్, వదిన వైఎస్ భారతిలను షర్మిల కలిశారు. అంతకుముందు వైఎస్ షర్మిలారెడ్డి, వారి కుటుంబ సభ్యులకు ఎయిర్ పోర్టులో ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వాగతం పలికారు. వైఎస్ షర్మిల స్పెషల్ ఫ్లైటులో కడప నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అక్కడ నుంచి వాహనంలో తాడేపల్లికి వెళ్లారు. అనంతరం సీఎం జగన్‌ను కలిశారు. చాలా రోజులుగా సోదరుడు వైఎస్ జగన్‌ను షర్మిల కలవలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్థంతి కార్యక్రమాల్లో కూడా విడివిడిగా పాల్గొన్నారు.