విపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్ చేయడం సిగ్గుచేటని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ప్రశ్నించే గొంతుకను చంపాలని చూసే కుట్ర ఇది అని, దేశ ప్రతిపక్ష నేతపై సబ్ స్టాంటివ్ మోషన్ పెట్టడం మోదీజి నిరంకుశత్వానికి పరాకాష్ట అని ఫైర్ అయ్యారు. అమెరికా ట్రేడ్ డీల్ పై రాహుల్ నిజాలు చెప్తే ప్రధాని నరేంద్ర మోదీ వణుకుతున్నారని, అందుకే సభాహక్కుల పేరుతో రాహుల్ గాంధీ గొంతు నొక్కాలని చూసున్నారని ఆరోపించారు.
'బ్లాక్ డీల్ పై కుండబద్దలు కొడితే రాహుల్ గాంధీని దేశ ద్రోహి అంటారా? వ్యతిరేక శక్తులతో కుమ్మక్కు అంటూ నిందలు వేస్తారా ? నిధులు, ఆత్మకథలు అంటూ కట్టుకథలు అల్లుతారా ? ఇదేనా RSS ఉగ్రవాద రాజకీయం ? బ్లాక్ డీల్ కింద ఏకంగా అమెరికాకు భరతమాతను అమ్మేశారు. భారత ఇంధన భద్రతను ట్రంప్ కి మొత్తంగా కట్టబెట్టారు' అని వైఎస్ షర్మిల ఆరోపించారు.
అగ్రరాజ్యం ఒత్తిడికి సాగిలపడ్డ ప్రధాని మోదీ దేశ భవిష్యత్ నే తాకట్టు పెట్టారని, భారత రైతులను ఉరికొయ్య ఎక్కించారని, వ్యవసాయాన్ని చంపేశారని విమర్శించారు. ''అమెరికాతో ట్రేడ్ డీల్‌లో నిజంగా ఎలాంటి లాజిక్ లేదు. భారత్ ఎలాంటి దామాషా ప్రయోజనాలు పొందలేదు. ఇరాన్ నుంచో, రష్యా నుంచో, మరో చోట నుంచో చమురు కొనుగోలు చేయాలని అమెరికా ఎలా నిర్ణయిస్తుంది? రాహుల్ జి పై ఎలాంటి హక్కుల తీర్మానం పెట్టినా కాంగ్రెస్ ప్రజల పక్షం. దేశ భవిష్యత్ ను కాపాడే విషయంలో వెనుకంజ వేసేది లేదు. దేశ ప్రజలు ఇప్పుడు రాహుల్ గాంధీ పక్షం'' అని పేర్కొన్నారు.