ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మనల్ని మోసం చేసిందని.. 2015లో ఇచ్చిన హామీని ఈ రోజు వరకూ నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు మద్దతు ఇస్తున్నందు వల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనే విషయాన్ని మోదీ గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సాధించుకు రావాలని డిమాండ్ చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా త్వరగా పూర్తి చేయాలని.. విభజన చట్టంలో పెట్టిన వాటిలో చాలా వాటిని సాధించుకోవాల్సి ఉందన్నారు.
చంద్రబాబు ఇప్పుడే గెలిచారని తమకు తెలుసునని, కానీ ఏపీ వెనుకబడిన రాష్ట్రం కాబట్టి వారు హనీమూన్ పీరియడ్ తీసుకునే పరిస్థితి కూడా లేదన్నారు వైఎస్ షర్మిల. అభివృద్ధి, సంక్షేమ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు కంకణం కట్టుకున్నందువల్లే కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఓట్లు సాధించలేదన్నారు. 2029 నాటికి తాము మంచి స్థాయికి చేరుకుంటామన్నారు. ఒక పార్టీ ఓడిపోయినందుకు వైఎస్ విగ్రహాలపై దాడులు దారుణమని షర్మిల అన్నారు. చనిపోయిన వారికి రాజకీయాలు ఆపాదించవద్దని కోరారు.