అవినాష్ రెడ్డిపై పోటీ చేయ‌నున్న వైఎస్ షర్మిల..!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధినేత్రి వైఎస్ షర్మిల కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.

By Medi Samrat  Published on  18 March 2024 11:00 AM GMT
అవినాష్ రెడ్డిపై పోటీ చేయ‌నున్న వైఎస్ షర్మిల..!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధినేత్రి వైఎస్ షర్మిల కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. వైఎస్సార్‌ కడప జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ఆయన సొంతగడ్డపైనే ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాల‌ని ప్రస్తుత ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిపై వైఎస్సార్‌సీపీ మరోసారి విశ్వాసం ఉంచింది. తన బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో అవినాష్ రెడ్డి పేరు కూడా ఉంది.

వైఎస్ అవినాష్ రెడ్డి స్థానంలో ఇత‌ర‌ నేతలను పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ వైఎస్ జగన్ మాత్రం అవినాష్‌పైనే నమ్మకం ఉంచి కడప నుంచి పోటీకి దింపారు. అవినాష్‌ను కట్టడి చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం అధికార పార్టీ వ్యతిరేక అంశాల‌పై కసరత్తు చేస్తోంది. అందుకే వైఎస్ షర్మిలను కడప నుంచి పోటీకి దింపాలని పార్టీ నిర్ణయించిన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు పార్టీ అధినాయకత్వం కసరత్తు ప్రారంభించిందని ఏపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి న్యూస్‌మీటర్‌తో అన్నారు.

మంగళవారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరుగుతుందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఖరారుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మార్చి 25న అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని.. అదే రోజు కడప ఎంపీగా వైఎస్‌ షర్మిల అభ్యర్థిత్వానికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని ఏపీసీసీ అధికార ప్రతినిధి తెలిపారు.

పొత్తులో భాగంగా వామపక్షాలతో సీట్ల పంపకాలపై ప్రశ్నించగా.. రాష్ట్రంలోని వామపక్షాలతో సీట్ల పంపకంపై ఇప్పటికే ఏపీసీసీ చీఫ్‌ చర్చించారని, ఇదే విషయాన్ని కేంద్ర పార్టీ అధిష్టానానికి తెలియజేశారని చెప్పారు. మార్చి 25న తొలి జాబితా విడుదలకు ముందు దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

వైఎస్సార్‌సీపీ, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది.. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాత ప్రతిపక్షాలు, అధికార పక్షాలు ప్ర‌చారం మొద‌లుపెట్ట‌డంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

Next Story