వైఎస్సార్సీపీలో వైఎస్సార్ లేరు.. జగన్‌కి బొత్స తండ్రి సమానులట: వైఎస్ షర్మిల
ఏపీలో రాజకీయ పార్టీల హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
By అంజి Published on 24 April 2024 9:31 AM GMTవైఎస్సార్సీపీలో వైఎస్సార్ లేరు.. జగన్‌కి బొత్స తండ్రి సమానులట: వైఎస్ షర్మిల
ఏపీలో రాజకీయ పార్టీల హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బొత్స.. జగన్‌కు తండ్రి సమానులు అంటూ ఓ వార్తను ఈరోజు ఉదయం పేపర్‌లో చూశానని.. ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్సార్‌ను తిట్టిపోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రేపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల మాట్లాడారు.
''ఇదే బొత్స వైఎస్సార్‌ను త్రాగుబోతు అని తిట్టాడు. ఇదే బొత్స జగన్‌కు ఉరి శిక్ష వేయాలని అన్నాడు. జగన్ మోహన్ రెడ్డి బినామీలు అన్నాడు. విజయమ్మ ను సైతం అవమాన పరిచాడు. ఇలాంటి బొత్స జగన్‌కు తండ్రి సమానులు అయ్యారు'' అంటూ ఎద్దేవా చేశారు. జగన్ క్యాబినెట్‌లో ఉన్నవారందరూ వైఎస్సార్‌ను తిట్టినవారేనని, వైఎస్‌ఆర్‌ను తిట్టిన వారికే జగన్ పెద్దపీట వేశారని షర్మిల అన్నారు. వీళ్ళందరూ జగన్ తండ్రులు, అక్కలు, చెల్లెల్లు.. నిజంగా ఆయన కోసం పని చేసిన వాళ్ళు ఈయనకు ఏమి కారు అని అన్నారు.
''ఆయన (జగన్) కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమి కారు. ఆయన కోసం పని చేసి గొడ్డలి పోటుకు గురైన వాళ్ళు ఏమి కారు. వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ పేరులో వైఎస్‌ఆర్ లేడు.. Y అంటే YV సుబ్బారెడ్డి,S అంటే సాయి రెడ్డి ,R అంటే రామకృష్ణా రెడ్డి'' అని వైఎస్‌ఆర్‌సీపీకి కొత్త అర్ధం చెప్పారు. 10 ఏళ్లలో రేపల్లె లో అభివృద్ధి జరిగిందా ?, ఏ వర్గానికి అయినా న్యాయం జరిగిందా ? అని షర్మిల ప్రజలను ప్రశ్నించారు.
''సీఎం జగన్ ఇక్కడకు వచ్చారట.. హామీలు ఇచ్చారట.. చెక్ డ్యాం లు కట్టి లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారట.. 100 పడకల ఆసుపత్రి అన్నారట.. అక్వా రైతుల కోసం ఆక్వా పార్క్ అన్నారట.. ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామని చెప్పారట.. షిప్పింగ్ హార్బర్ కడతాం అన్నారట. కానీ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు ఈ సీఎం జగన్'' అంటూ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శలు గుప్పించారు.