మైనింగ్ కుంభకోణంలో పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా దర్యాప్తు జరగాలి : షర్మిల

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకట్ రెడ్డి లాంటి తీగలే కాదు.. పెద్ద డొంకలు కూడా కదలాలని.. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా.. విచారణ జరపాలని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు

By Medi Samrat  Published on  28 Sept 2024 2:15 PM IST
మైనింగ్ కుంభకోణంలో పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా దర్యాప్తు జరగాలి : షర్మిల

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకట్ రెడ్డి లాంటి తీగలే కాదు.. పెద్ద డొంకలు కూడా కదలాలని.. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా.. విచారణ జరపాలని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు. రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకట్ రెడ్డి అయితే.. తెరవెనుక ఉండి, సర్వం తానై, వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకు తిన్నారని ఆరోపించారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారు. టెండర్లు, ఒప్పందాలు, APMMC నిబంధనలన్ని బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టి.. NGT నిబంధ‌న‌ల‌ను తుంగలో తొక్కి.. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖజానాకు తరలించారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ACB విచారణతో పాటు.. పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా దర్యాప్తు జరగాల‌ని.. అందుకు సహజ వనరుల దోపిడీపై CBI విచారణను కోరండని కూటమి సర్కార్ ను డిమాండ్ చేశారు.

Next Story