చిన్నాన్న అలా మాట్లాడితే నా కళ్ల‌లో నీళ్లు తిరిగాయి : షర్మిల

వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై షర్మిల ఫైర్ అయ్యారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. జగన్‌తో ఆస్తుల వివాదంలో విజయమ్మ స్పందిస్తారని తెలిపారు

By Medi Samrat  Published on  26 Oct 2024 12:26 PM GMT
చిన్నాన్న అలా మాట్లాడితే నా కళ్ల‌లో నీళ్లు తిరిగాయి : షర్మిల

వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై షర్మిల ఫైర్ అయ్యారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. జగన్‌తో ఆస్తుల వివాదంలో విజయమ్మ స్పందిస్తారని తెలిపారు. ఇప్పుడిప్పుడే ప్రజలు కల్తీ లడ్డు గురించి మరిచిపోతున్నారు. వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు నా మీద ఎందుకు మాట్లాడుతున్నారని కౌంట‌ర్ ఇచ్చారు. అసలు నా మీద ఆయన ఏం మాట్లాడారో తెలుసుకుని తప్పకుండా స్పందిస్తాన‌న్నారు. సుబ్బారెడ్డి అనే వ్యక్తి జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి.. జగన్ కు పక్కనే ఉండి.. ఆయన పదవులు ఇస్తే అనుభవించారు.. మరి సుబ్బారెడ్డి ఇలా కాకుంటే.. ఇంకెలా మాట్లాడతారని అన్నారు.

సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు ఆర్ధికంగా కూడా గట్టిగా, గొప్పగా లాభపడ్డారన్నారు. జగన్ సీఎంగా ఉంటే.. వారికి మేలు జరిగిందనేది వాస్తవం అన్నారు. ఒక్క సుబ్బారెడ్డే కాదు.. రేపు విజయసాయిరెడ్డి కూడా మాట్లాడతారని అన్నారు. ఆయన కూడా జగన్ మోచేతి కిందే ఉన్నారు.. రేపు ఆయనా ఇలానే మాట్లాడతారు. సుబ్బారెడ్డి అయినా, సాయిరెడ్డి అయినా.. జగన్ పక్షాన ఉన్నారని తెలిసి కూడా నిన్న నేను రాసిన లేఖలో వారి పేర్లు ప్రస్తావించాను. ఎందుకంటే వాళ్లల్లో నిజాయతీ ఏమైనా ఉంటుందేమో ప్రజలకు అర్దం కావాలని పేర్లు పెట్టాను. మా అమ్మకు కూడా పూర్తిగా వాస్తవాలు తెలుస్తాయనే పెట్టానన్నారు. రాజశేఖరరెడ్డి ఆలోచనలు, ఆశయాలు వారికి అన్నీ తెలుసు. అయినా కూడా ఇంత దిగజారి మాట్లాడుతున్నారంటే.. వారి నిజరూపం ప్రజలకు అర్దం కావాలని, ముఖ్యంగా అమ్మ తెలుసుకోవాలనే అన్నారు.

నా వరకు నేను చెబుతున్నందతా నిజమని ప్రమాణం చేయగలను.. సుబ్బారెడ్డి చెప్పేదంతా నిజమని ప్రమాణం చేయగలరా అని స‌వాల్ విసిరారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను చెప్పేవన్నీ వాస్తవాలు అని ధీమాగా చెబుతున్నా. నలుగురు బిడ్డలకు సమాన వాటా ఉండాలని వైయస్ ఆలోచన. ఇది నిజమని నా బిడ్డలపై నేను ప్రమాణం చేస్తున్నాను. వైయస్ ఆఖరి రోజుల్లో కూడా ఆస్తులు పాప పేరు మీద బదిలీ అవలేదని కూడా అడిగారు. ఆరోజు జగనన్న మూడు అడుగుల కన్నా తక్కువ దూరంలో కూర్చుని నాన్నకు మాట ఇచ్చారు. నాన్నా.. ఈ లోకంలో మీ తర్వాత పాప మేలు కోరే వారిలో నేనే మొదటి వాడిని అని, డోంట్ వర్రీ డాడ్ అని చెప్పారు. ఇదంతా నిజమని నా బిడ్డలపై నేను ప్రమాణం చేసి చెబుతున్నాను. సుబ్బారెడ్డి కూడా తన బిడ్డలు, తన మనవళ్ల పై ప్రమాణం చేసి నిన్న చెప్పినదంతా నిజమని చెప్పగలరా అని స‌వాల్ విసిరారు.

భారతి, జగతికి అయితే ఏమీ.. వాళ్ల పేర్లు పెట్టుకున్నామని అంటున్నారు. ఆరోజు వాళ్లకు కుదిరింది కాబట్టి.. ఆస్తులన్నీ జగన్, భారతీలవేనట.. ఆరోజు మేము అభ్యంతరం చెప్పలేదు కాబట్టే.. వాళ్లు ఆపేర్లు పెట్టుకున్నారు.. వైయస్సార్ కూడా పేర్లు పెట్టుకుంటే నష్టం ఏముందిలే అని ఆరోజు అనుమతించారు.. పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆస్తులు మొత్తం వాళ్లవేనని అంటే ఎలా అని ప్ర‌శ్నించారు. ఆస్తులు జగన్ వి కాబట్టే.. ఆయన జైలుకు వెళ్లాడని సుబ్బారెడ్డి అన్నారు. మరి ఆస్తులు భారతివి అయితే.. ఆమె కూడా జైలుకు వెళ్లాలి కదా అని ప్ర‌శ్నించారు. ఆస్తులు ఉన్నంత మాత్రాన జైలుకు వెళ్లాలని రూల్ ఏమీ లేదన్నారు. ఎవరు అవినీతి చేశారో చూసి.. వారిపై కేసులు పెడతారు.. సుబ్బారెడ్డి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి ఉంటే బాగుండేది.. ఎవరైనా గిఫ్ట్ ఇస్తే.. ఎక్కడైనా ఎంఓ యూ రాసుకుంటారా.? అని ప్ర‌శ్నించారు. ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత ఉంది కాబట్టే.. ఆనాడు ఎంఓయూ ఇచ్చారు, సంతకం పెట్టారు.. ఆయన ఆస్తి గిప్ట్ గా ఇస్తే.. ఎంఓయూ ఎందుకో సుబ్బారెడ్డి దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఎం.ఓ.యూలో 4.2 లో ఆనాడు సరస్వతీ షేర్స్ ఎటాచ్ కాలేదు కాబట్టి.. వెంటనే ట్రాన్స్ ఫర్ చేస్తామ‌న్నారు. సైన్ చేస్తున్న ఈ ఎం.ఓ.యూ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ట్రాన్స్ ఫర్ అనే పదాన్ని అండర్ లైన్ చేసి చెబుతున్నాను.. అటాచ్ కాలేదు.. ట్రాన్స్ ఫర్ చేయాలని తెలిసే.. ఈ ఒప్పందాలు చేశారన్నారు.

అన్ని ఇళ్ళల్లో ఉండే విషయమే అని జగన్ చాలా సింపుల్ గా చెప్పేశారు. కన్నతల్లిని కోర్టుకు ఈడ్చటం ఘర్ ఘర్ కా కహానీనా జగన్ గారూ.. కన్న తల్లిని ఆస్తి కోసం కోర్టుకు లాగిన దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారా.. అంత సునాయశంగా, సులభంగా మాట్లాడుతున్నారంటే.. మీకు మానవత్వం ఉందా.. ఎమెషన్స్ లేవా అని అడిగారు.

సజ్జల మాట్లాడినా, సాక్షి రాసినా నేను పెద్దగా పట్టించుకోను అన్నారు. కానీ చిన్నాన్న సుబ్బారెడ్డి మాట్లాడితే.. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా బిడ్డలు నీ ముందు పెరగలేదా.. తాత అని పిలవలేదా.. ఏది నిజమో, ఏది అబద్దమో మీకు తెలియదా.. ఆత్మ పరిశీలన చేసుకోండి.. దేవుడు ఉన్నాడు.. నాన్న పైన ఉన్నాడు.. చూస్తున్నారని అన్నారు.

Next Story