మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనా జగనన్న.? : వైఎస్ షర్మిల
రాష్ట్రంలో దళితుల మీద దారుణంగా దాడులు జరుగుతున్నాయని.. 60 మంది మీద దాడులు చేశారని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు
By Medi Samrat Published on 9 Feb 2024 9:15 PM ISTరాష్ట్రంలో దళితుల మీద దారుణంగా దాడులు జరుగుతున్నాయని.. 60 మంది మీద దాడులు చేశారని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు. కొవ్వూరు నియోజకవర్గంలో చాగల్లులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. కొవ్వూరు ఎమ్మెల్యే.. ఒక హోం మంత్రి.. దళిత మంత్రి అయ్యి ఉండి కూడా రాష్ట్రంలో రక్షణ లేదన్నారు. బెదిరించి దాడులు చేస్తున్నారని.. హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. దళితురాలు హోం మంత్రిగా ఉండి దళితులపై దాడులు ఆపలేకపోయారని.. వెంటనే తానేటి వనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వికలాంగులకు స్వయం ఉపాధి కల్పించుకొనేలా ప్రత్యేక నిధి పెడతామని.. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడతామన్నారు. జగన్ ఆన్న ప్రభుత్వంలో నిత్యావసర ధరలు బాగా పెరిగాయన్నారు. ఖర్చులు కొండంత.. బరోసా, అసార గోరంత.. అమ్మ ఒడి కింద ప్రభుత్వం 12 వేలు ఒక బిడ్డకు ఇస్తుంది.. రాష్ట్రంలో అందరికీ ఓకే బిడ్డ ఉండాలా.? ఇద్దరు పిల్లలు ఉంటే అమ్మఒడి ఇవ్వరా.? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో జగన్ ఆన్న ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తాం అన్నారు. ఇచ్చిన మాట జగన్ ఆన్న తప్పాడు. జగన్ ఆన్న పథకాలు ఒక చేత్తో ఇస్తూ.. మరో చేత్తో గుంజుకొనేలా ఉంటాయన్నారు.
సర్కారు కల్తీ మద్యం అమ్ముతుంది. ఎంత రేటు చెప్తే అంతా కొనాల్సిందే. సర్కారు మద్యం పేరిట చేస్తున్నది ఒక దోపిడీ.. మట్టి బిందె ఇచ్చి.. వెండి బిందె ఎత్తుకు పోతున్నారని ఆరోపించారు. రాష్ట్రం అంతా ఇసుక దోపిడీ.. వ్యవసాయానికి భరోసా ఉందని చెప్పే పరిస్థితి లేదన్నారు. జాబ్ క్యాలెండర్ అని జగన్ ఆన్న నిరుద్యోగులను మోసం చేశారు.. చంద్రబాబును హేళన చేసిన జగన్ గారు చేసింది ఏమిటి.? అని ప్రశ్నించారు.
25 వేల టీచర్ పోస్టులతో ఎక్కడకు పోయింది మెగా డీఎస్సీ.? మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారన్నారు. పాదయాత్ర లో జగన్ ఆన్న ఎన్నో హామీలు ఇచ్చారు. ఇదే కొవ్వూరు లో షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేదు? మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనా జగన్ ఆన్న అని ప్రశ్నించారు.
వైఎస్సార్ వారసులు అంటే హామీలు ఇచ్చి మోసం చేయడమా.? అని ప్రశ్నించారు. బాబు, జగన్ ఇద్దరు బీజేపీకి బానిసలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారు.. వంగి వంగి దండాలు పెడతారు.. పోటీలు పడి పొత్తులు పెట్టుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.. గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని బీజేపీ దారుణంగా మోసం చేసిందన్నారు. హోదా ఇవ్వలేదు. పోలవరంకు నిధులు ఇవ్వలేదు. రాజధాని 3ఢీ గ్రాఫిక్స్ కే పరిమితం అయ్యిందన్నారు. ఎన్నికలు వస్తున్నాయి. ఈ సారి ప్రజలు ఆలోచన చేయాలి. టీడీపీ, వైసీపీకి ఓటు వేస్తే.. బీజేపీకి వేసినట్లేనన్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. హస్తం గుర్తు మన రాష్ట్రానికి ఒక అభయ హస్తం అన్నారు. కాంగ్రెస్ తోనే హోదా వస్తుంది. కాంగ్రెస్ తోనే పోలవరం పూర్తి అవుతుంది.. కాంగ్రెస్ తోనే ఉద్యోగాలు వస్తాయి. ఇది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ.. రాజన్న రాజ్యం కాంగ్రెస్ తోనే సాధ్యం అని అన్నారు.