ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాన్వాయ్‌కి ప్రమాదం తప్పింది. కడప ఎయిర్‌పోర్టు నుంచి పులివెందుల వెళ్తుండగా రామరాజుపల్లి వద్ద ఆయనను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఈ క్రమంలో కాన్వాయ్‌లోని ఓ వాహన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్‌లో ఉన్న ఫైరింజన్ వాహనాన్ని ఓ ప్రైవేట్ వెహికల్ ఢీకొట్టింది. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కొద్దిసేపటి తర్వాత జగన్ తిరిగి పులివెందులకు బయల్దేరారు. జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈరోజు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి పులివెందులకు కాన్వాయ్‌లో బయల్దేరిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది.
వైఎస్ జగన్ నేటి నుండి సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు జగన్ పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉంటారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. పులివెందుల టూర్‌లోనూ ఉమ్మడి కడప జిల్లా వైసీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఓటమితో నిరాశలో ఉన్న శ్రేణులకు ధైర్యం చెప్పడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. పులివెందుల పర్యటనలో స్థానిక నేతలందరినీ కలవనున్నారు.