బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పార్కును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు గ్రామంలో పర్యటించారు. ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మత్స్యకారుల సమస్యలను విన్నారు. వారికి భరోసా ఇచ్చారు. త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజయ్యపేటకు వస్తారని, పార్టీ మొత్తం మత్స్యకారులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బల్క్ డ్రగ్ పార్క్‌ను రద్దు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. హోంమంత్రి అనితకు పాలన చేతకాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికల ముందు బల్క్ డ్రగ్ పార్క్ వల్ల క్యాన్సర్లు వస్తాయని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాట మార్చారని వైసీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ మొదటి నుంచి బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకమని తెలిపారు.