ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రం 'జంగల్ రాజ్'గా మారిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గిరిజనులు, మహిళలు, పేదలు ఆపదలో ఉన్నప్పుడు పోలీసులు కాగితాలకే పరిమితమవుతున్నారని, అధికారంలో ఉన్నవారు కేవలం ప్రచార స్టంట్లు, అవినీతిపైనే దృష్టి పెట్టారని ఆయన విమర్శించారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన 17 ఏళ్ల గిరిజన బాలికపై జరిగిన అమానుష ఘటనను ప్రస్తావిస్తూ, చదువు చెప్పిస్తామని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ప్రాణాలు తీశారని, ఈ విషయంలో నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. బాధితురాలి అంత్యక్రియలను హడావుడిగా నిర్వహించాలని కుటుంబంపై ఒత్తిడి తెచ్చారని, ఇది వ్యవస్థాగత వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
అదేవిధంగా, మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు 100, 108లకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదని బాధితులు వాపోతున్నారని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం 'రెడ్ బుక్' పాలన సాగిస్తూ పోలీసులను కీలుబొమ్మలుగా మార్చేసిందని, ప్రజలకు రక్షణ కరువైందని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆరోపించారు.