ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైఎస్ జగన్
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు
By Medi Samrat Published on 30 Aug 2024 9:41 PM ISTకృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. చంద్రబాబు ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టకండని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని.. ప్రతిపక్షపార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్‌బుక్ రాజ్యాంగం చేస్తూ పాలనను గాలికొదిలేశారని వైఎస్ జగన్ విమర్శించారు.
"చంద్రబాబుగారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షపార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్‌బుక్ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గొలికొదిలేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ సహా గవర్నమెంటు రెసిడెన్షియల్ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందలమంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పిల్లలకు నాణ్యతతో, రోజూ ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్నీ అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు. మరోవైపు గుడ్లవల్లేరు ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. విద్యార్థుల జీవితాలను అతలాకుతలంచేసే ఘటన ఇది. చంద్రబాబుగారూ ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును పణంగా పెట్టకండి." అంటూ వైఎస్ జగన్ ఎక్స్ లో ధ్వజమెత్తారు.