సీఎం చంద్రబాబూ.. మీరు పాలించడానికి అర్హులేనా?: వైఎస్ జగన్
గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త మందా సాల్మన్ హత్యకు టీడీపీ వర్గీయులే కారణమని మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
By - అంజి |
సీఎం చంద్రబాబూ.. మీరు పాలించడానికి అర్హులేనా?: వైఎస్ జగన్
అమరావతి: గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త మందా సాల్మన్ హత్యకు టీడీపీ వర్గీయులే కారణమని మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. 'రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలితీసుకుంటారు? మీరు పాలించడానికి అర్హులేనా? పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? ' అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. రెడ్ బుక్ రాజ్యాంగం ముసుగులో అరాచకాలు సాగిస్తున్నారని, అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి వచ్చిన వ్యక్తిని కిరాతకంగా చంపడం దుర్మార్గమని మండిపడ్డారు.
''మందా సాల్మన్ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారు? అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి హత్యచేస్తారా? పైగా సాల్మన్‌పైనే తప్పుడు ఫిర్యాదు పెట్టిస్తారా? ఇలాంటి దారుణాలు చేయడానికా మీరు అధికారంలోకి వచ్చింది? ఈ ఘటన ముమ్మాటికీ వైయస్సార్‌సీపీని భయపెట్టడానికి, కట్టడిచేయడానికి మీరు, మీ పార్టీవారి ద్వారా, కొంతమంది పోలీసులు ద్వారా చేస్తున్న, చేయిస్తున్న రాజకీయ హింసాత్మక దాడుల పరంపరలో భాగమే'' ఇది అని వైఎస్ జగన్ ఆరోపించారు.
''ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, మీరు అజమాయిషీ చెలాయిస్తూ, ఊళ్లో మీకు గిట్టని వారు ఉంటే చంపేస్తామని మీ వాళ్లు, మీ ఎమ్మెల్యే, మీ పోలీసుల బెదిరింపులతో పిన్నెల్లి గ్రామం నుంచి వందలకొద్దీ వైయస్సార్ కార్యకర్తల కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇదొక్కటే కాదు, అసెంబ్లీ ఎన్నికలు ముగిసింది మొదలు ఇలాంటి ఎన్నో ఘటనలు పల్నాడు సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా? అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్షలకోసం శాంతిభద్రతలను దెబ్బతీసి హత్యారాజకీయాలకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా?'' అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.