ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోందన్నారు. అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతోందని, ప్రతి గ్రామంలోనూ మద్యం షాపులు, బెల్టుషాపులు, పేకాట క్లబ్బలు నడుస్తున్నాయన్నారు. వ్యవస్థలన్నీ పూర్తిగా నాశనం చేశారని విమర్శించారు. అధికారం ఉందని దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారని.. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్తారని హెచ్చరించారు. చంద్రబాబు భయపెట్టే ప్రయత్నాలు ఎక్కువ చేస్తాడని, మనం అప్రమత్తంగా ఉండాలని వైసీపీ శ్రేణులకు వైఎస్ జగన్ సూచించారు.
చంద్రబాబు పాలనలో ఆరు నెలలు తిరక్కముందే ప్రజలకు తోడుగా వైసీపీ నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు వైఎస్ జగన్. ప్రజల తరఫున పోరుబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, పార్టీ శ్రేణులు, నాయకులు కలిసికట్టుగా నిలవాలన్నారు. ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా నిలవాలని సూచించారు. సంఖ్యాబలం లేకపోయినా అన్ని పదవులు తనకే కావాలని చంద్రబాబు అధికార అహంకారం చూపుతున్నారని విమర్శించారు.