'ఈ రాష్ట్రం మీ జాగీరా?.. ఎప్పటికీ మీరే సీఎం అని కలలు కంటున్నారా?'.. చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.

By అంజి
Published on : 6 Sept 2025 7:27 AM IST

YS Jagan, allegations, CM Chandrababu, APnews

'ఈ రాష్ట్రం మీ జాగీరా?.. ఎప్పటికీ మీరే సీఎం అని కలలు కంటున్నారా?'.. చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు అనుకున్నంత పనీచేశారని, సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా వారి దగ్గరి వారికి కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. తాము పెట్టిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను కేబినెట్లో స్కాంలకోసం ప్రైవేటు పరం చేయడం అవినీతిలో సీఎం చంద్రబాబు బరితెగింపునకు నిదర్శనమని అన్నారు. ఇది రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయమని, ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే సీఎం చంద్రబాబుకు పేరు ఉందని అన్నారు. ప్రజలకోసం కాకుండా దోపిడీకోసం నిర్ణయాలు తీసుకోవడానికే చంద్రబాబు మంత్రివర్గ సమావేశాలు పెడుతున్నట్టు ఉందని వైఎస్‌ జగన్‌ విమర్శించారు.

వైఎస్‌ జగన్‌ మాటల్లో..

1923 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 11. పద్మావతి అటానమస్‌ కాలేజీతో కలుపుకుంటే మొత్తం 12. 2019కి ముందు 3 దఫాలుగా ఉన్న సీఎంగా ఉన్న మీరు, ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్‌ కాలేజీ అయినా పెట్టారా? కనీసం ఆ ఆలోచన చేశారా? మీరెలాగూ చేయలేదు. కనీసం మా 5 ఏళ్ల అతికొద్దికాలంలో మేము పెట్టిన 17 కాలేజీల్లో 5 చోట్ల కాలేజీలు పూర్తై, క్లాసులు కూడా ప్రారంభం అయ్యాయి. ఎన్నికలు ముగిశాక మరోచోట అడ్మిషన్లు కూడా జరిగాయి. మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ఉంటే, గత ఏడాది మరో 5, ఈ ఏడాది మరో 7 కాలేజీల్లో కూడా క్లాసులు స్టార్ట్‌ అయ్యేవి కదా? మరి వాటిని ముందుకు తీసుకెళ్లకుండా ఈ రాష్ట్రానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు? ప్రస్తుతం ఈ కాలేజీలు అక్కడ రావడంతో అమాంతంగా విలువ పెరిగిన ఆ కాలేజీల భవనాలు, భూములు కొట్టేయడానికి మీరు వేసిన ప్లానే కదా ఇది? అవినీతికోసం ఇంతగా తెగిస్తారా?

మా ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్‌ సీట్లు 2,360. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా సీట్లు మరో 2,550 పెరిగి, 4,910కి చేరుకుంటాయి. మేం పూర్తిచేసి, క్లాసులు ప్రారంభించడంతో కొత్తగా సుమారు 800 సీట్లు భర్తీ కూడా అయ్యాయి. వైద్య విద్యలో ఇదొక అద్భతమైన కార్యక్రమం అయినప్పుడు దీన్ని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసం? రాష్ట్రంలో అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి చిరునామాగా నిలిచిన కాలేజీల్లో సగం సీట్లు ఉచితంగానూ, మరో సగం సీట్లు ప్రైవేటు వాళ్లతో పోలిస్తే తక్కువ ఫీజుతోనూ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి కదా? కళ్లముందే ఫలితాలు కనిపిస్తున్నా, ఈ కాలేజీలను ఎందుకు నాశనం చేస్తున్నారు? ఇక్కడ సరిపడా మెడికల్‌ సీట్ల లేకపోవడంతో తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటున్న తల్లిదండ్రులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఇక్కడ ప్రయివేటు మెడికల్‌ సీట్లు కొనే స్తోమత లేక, ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్మి ఇతర రాష్ట్రాలకు, జార్జియా, ఉక్రెయిన్‌, రష్యా, పిలిప్ఫైన్స్‌ లాంటి ఇతర దేశాలకూ పంపిస్తున్న మాట వాస్తవం కాదా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల కాలేజీకి NMC మెడికల్‌ సీట్లు ఇస్తే, వద్దంటూ మీరు లేఖ రాసినప్పుడే మీ కుట్ర ఏంటో బయటపడింది చంద్రబాబు? పేదలకు ఆ జిల్లాలోనే ఉచితంగా సూపర్‌ స్పెషాల్టీ సేవలు అందాలన్న గొప్ప ఉద్దేశాన్ని నిలువునా దెబ్బకొడుతున్నారు కదా చంద్రబాబుగారూ?

ప్రతి జిల్లాలోనూ వైద్య ఆరోగ్య రంగంలో, ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వరంగం కూడా ఉండాలని, అప్పుడే, అక్కడే ఈ కొత్త కాలేజీల వల్ల అందుబాటులోకి వచ్చే ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్లు, వివిధ రంగాల్లో ఫ్యాకల్టీలు, సూపర్‌ స్పెషాల్టీ సేవల కారణంగా మంచి మెడికల్ విద్యతోపాటు, ప్రజలకు కూడా వైద్యం ఉచితంగా అందుబాటులో ఉంటుందని, అంతేకాకుండా ప్రభుత్వ రంగం, ప్రైవేటు ఆస్పత్రులు, ఈ రెండూ సమతుల్యతతో, స్వయం సమృద్ధితో పనిచేస్తాయన్న కనీస జ్ఞానం లేకుండా, లంచాలకోసం, కమీషన్ల కోసం కక్కుర్తితో ప్రజల ఆస్తులను ఇలా మీ వాళ్లకు పందేరం చేస్తారా? ఈ రాష్ట్రం మీ జాగీరు అనుకుంటున్నారా? ఎప్పటికీ మీరే కుర్చీలో ఉంటారని కలలు కంటున్నారా?

రాష్ట్ర ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని కూడా మీరు బతకనివ్వలేదు కదా చంద్రబాబుగారూ? ఈ 15 నెలల కాలంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన, దాదాపు రూ. 300 కోట్లు, అంటే 15 నెలల్లో రూ.4,500 కోట్లకు గాను, కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చి, దాదాపు రూ.4,000 కోట్లు ఎగ్గొట్టి, పేదవాడి ఆరోగ్య భద్రతను భ్రష్టు పట్టించారు. వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే, 3,257 ప్రొసీజర్లకు ఉచిత వైద్యం అందించేలా, రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే ఉచితంగా భరించేలా ప్రజలకోసం తీసుకు వచ్చిన గొప్ప ఆరోగ్యశ్రీని నాశనం చేశారు. చివరకు ఆపరేషన్‌ చేయించుకున్న వ్యక్తికి ఆ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేలు అందించే “ఆరోగ్య ఆసరా’’ను కూడా సమాధిచేశారు. దీనికి సంవత్సరానికి ఇవ్వాల్సిన రూ.450 కోట్లు, ఈ 15 నెలలకుగానూ దాదాపుగా రూ.600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు.

ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు త‌ప్పుకుని ప్రైవేటుకు ఇవ్వడం, అదో ఘనకార్యంగా ప్రచారం చేయించుకోవడం కరెక్టేనా? మా ప్రభుత్వ హయాంలోనే సంవత్సరాదాయం రూ.5లక్షల లోపు ఉన్నవారందరికీ వర్తింపు చేయడం ద్వారా మొత్తంగా రాష్ట్రంలో 95% కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఇది వాస్తవం కాదా? ఇక మీరు కొత్తగా చేసేది ఏముంది? మీ ఎల్లో మీడియాలో మోసం చేయడానికి డబ్బా కొట్టుకోవడం ఏంటి? ఒక్కోచోట, ఒక్కోమాదిరిగా మోసం చేసేందుకు ప్రచారం చేస్తున్నారు. అసలు మీ ఇన్సూరెన్స్‌ పథకం పరిధి రూ.2.5 లక్షలకేనా లేక రూ.25 లక్షలకా? అసలు ఈ 3257 ప్రొసీజర్లు అంటే, ఆపరేషన్ల ఖర్చు రూ.25 లక్షలదాకా ఉచితం అంటే అప్పుడు ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం ఏ రూ.5వేల కోట్లో దాటుతుంది. ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద రూ.3,600 కోట్లు ఖర్చు చేయడానికే మనసు లేనివారు, ఇక రూ.5వేల కోట్లు ప్రీమియంగా ఖర్చు చేస్తారా? ఇది నమ్మదగ్గ విషయమేనా? అంటే దీని అర్థం మళ్లీ మోసం.

ఒక బాధ్యతగా ప్రభుత్వం చేసే పనికీ, ప్రైవేటు కంపెనీలు చేసే పనికీ తేడా ఉంటుంది కదా చంద్రబాబుగారూ. దేశంలో అనేక ఆరోగ్య బీమా సంస్థల నుంచి క్లెయిముల పరిష్కారంలో వస్తున్న ఇబ్బందులు తెలియనివా? లాభాలు లేకుండా వారు ఇన్సూరెన్స్‌ వ్యాపారం చేస్తారా? కోవిడ్‌ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు అన్ని ఆరోగ్య బీమా కంపెనీలు, ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేస్తే, రాష్ట్ర ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించింది. ఇప్పుడు అలాంటి వెసులుబాటు ఉంటుందా? చికిత్సల జాబితాలో లేకపోయినా, ఏ కొత్త వ్యాధి అయినా ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని వినియోగించుకుని వెంటనే ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించే అవకాశాన్ని ప్రజలు ఇప్పుడు కోల్పోతారు కదా? కేవలం ప్రీమియం పేరిట మీ మనుషులకు చెందిన కంపెనీలకు దోచిపెట్టడానికి మీ ఈ నిర్ణయాలంటున్న ఆరోపణలకు, మీ సమాధానం ఏంటి?

Next Story