నిరుద్యోగులకు సీఎం జ‌గ‌న్ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

సంక్రాంతి పండుగ పూట నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధమైంది.

By అంజి  Published on  14 Jan 2024 12:54 AM GMT
CM YS Jagan, YCP government, unemployed, APnews

ప్రతీకాత్మక చిత్రం

సంక్రాంతి పండుగ పూట నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం సాయంత్రం ప్రకటించారు. ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో మెగా డీఎస్సీ పోస్టుల గురించి చర్చించడం జరిగిందన్నారు. మెగా డీఎస్సీలో ఎన్ని పోస్టులు ఉంటాయి, ఉద్యోగాల భర్తీపై విధి విధానాలను త్వరలోనే తెలియజేస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నాళ్లుగా డీఎస్సీ ప్రకటన లేకపోవడంతో ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహానికి లోనై ఉన్నారు.

ఈ నేపథ్యంలో, త్వరలో నోటిఫికేషన్ వస్తే వారికి ఇది కచ్చితంగా శుభవార్త కానుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 దరఖాస్తులకు చివరి తేదీని పొడిగించిన విషయం అందరికీ తెలిసిందే. జనవరి 17 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. గ్రూప్-2 దరఖాస్తు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అభ్యర్థులు వాపోవడంతో జనవరి 17 వరకు గడువు తేదీని పెంచారు. గత డిసెంబర్ నెలలో రాష్ట్రంలో మొత్తం 897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది.

Next Story