నేను వస్తున్నానని తెలిసి మొక్కుబడిగా ప్రకటించారు : వైఎస్ జగన్
సింహాచలంలో జరిగిన ప్రమాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
By Medi Samrat
సింహాచలంలో జరిగిన ప్రమాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. సింహాచలంలో గోడ కూలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ దురదృష్టకర సంఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం, అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినా, ప్రభుత్వం చందనోత్సవానికి కనీస ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
కేవలం ఆరు రోజుల క్రితం నిర్మాణం ప్రారంభించి, రెండు రోజుల క్రితమే పూర్తి చేసిన పది అడుగుల ఎత్తు, డెబ్బై అడుగుల పొడవున్న ఈ గోడ నిర్మాణానికి కనీసం టెండర్లు కూడా పిలవలేదని ఆరోపించారు. కాంక్రీట్‌తో నిర్మించాల్సిన గోడను ఫ్లైయాష్ ఇటుకలతో నాణ్యత లేకుండా కట్టారని విమర్శించారు. వర్షం పడుతుందని తెలిసి కూడా, కొత్తగా కట్టిన ఆ గోడ పక్కనే క్యూలైన్లు ఏర్పాటు చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆలయాల్లో ఇలాంటి దారుణాలు జరగడం దురదృష్టకరమని జగన్ వ్యాఖ్యానించారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ ఘటనలో కూడా తమపై నిందలు వేసే ప్రయత్నం చేశారని, కానీ గోడ తమ హయాంలో కాకుండా రెండు రోజుల క్రితమే కట్టిందని తేలిపోయిందని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 25 లక్షల పరిహారం సరిపోదని, అది కూడా తాను వస్తున్నానని తెలిసి మొక్కుబడిగా ప్రకటించారని జగన్ విమర్శించారు. ప్రభుత్వ తప్పిదం స్పష్టంగా కనిపిస్తున్నందున పరిహారాన్ని గణనీయంగా పెంచాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.