రాప్తాడులో కురుబ లింగమయ్య అనే వ్యక్తి మరణంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మళ్లీ పగడ విప్పిన ఫ్యాక్షన్ రాజకీయానికి రాప్తాడులో బలైన వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య ఉదంతం ఓ సాక్ష్యమని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఏపీలో చట్టబద్ధపాలన లేదని విమర్శించారు వైఎస్ జగన్. రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు అధికారపార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారన్నారు వైఎస్ జగన్.
రామగిరిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతల దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించారని, అయినా పోలీసులు వైసీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు వైఎస్ జగన్. అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవడంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వైఫల్యం కారణంగానే కురుబ లింగమయ్య హత్య జరిగిందని వైఎస్ జగన్ ఆరోపించారు. కురుబ లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.