ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది..రాజమండ్రి కల్తీ పాల ఘటనపై జగన్ ఫైర్

రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై మాజీ సీఎం వై.ఎస్. జగన్ తీవ్ర దిగ్భ్రాంతి మరియు ఆవేదన వ్యక్తం చేశారు.

By -  Knakam Karthik
Published on : 23 Feb 2026 2:11 PM IST

Andrapradesh, YS Jagan, YSRCP, Rajamahendravaram, Milk Adulteration, Health Emergency

ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది..రాజమండ్రి కల్తీ పాల ఘటనపై జగన్ ఫైర్ 

ఆంధ్రప్రదేశ్: రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి మరియు ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఆహార భద్రత అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని, కల్తీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిఘా వ్యవస్థల వైఫల్యం వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయని, ఇలాంటివి పునరావృతం కాకుండా తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే నిపుణులైన వైద్య బృందాలను రంగంలోకి దించాలని ఆరోగ్య శాఖను కోరారు. పాలు వంటి నిత్యావసర వస్తువుల నాణ్యతను తనిఖీ చేసేందుకు తనిఖీలను కఠినతరం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

రాజమండ్రిలోని లాలాచెరువు, చౌడేశ్వరి నగర్ ప్రాంతాల్లో గత రెండు రోజుల్లో నలుగురు మరణించారు. ఆదివారం రాత్రి ఎస్. శేషగిరిరావు (72), రాధాకృష్ణమూర్తి (74) చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఫిబ్రవరి 15 నుండి సుమారు 14 మంది 'అనూరియా' (మూత్రం విసర్జించలేకపోవడం) లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులందరూ ఒకే పాల విక్రేత వద్ద పాలు కొనుగోలు చేసినట్లు గుర్తించిన అధికారులు, ఆ పాలు కల్తీ కావడం వల్లే ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తాయని అనుమానిస్తున్నారు.

Next Story