అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా: వైఎస్ జగన్

అల్లు అర్జున్ అరెస్టును వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఖండించారు.

By Medi Samrat  Published on  13 Dec 2024 5:44 PM IST
అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా: వైఎస్ జగన్

అల్లు అర్జున్ అరెస్టును వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఖండించారు. "హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్‌ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు. అల్లు అర్జున్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను." అంటూ ట్వీట్ చేశారు.

అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. "అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? అని నిలదీశారు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, కానీ దీనికి అసలు కారకులు రాష్ట్ర పాలకులేనని ఆరోపించారు. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే అన్నారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్‌ని ఎందుకు అరెస్టులు చేయరు?" అని ప్రశ్నించారు.

Next Story