పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడుతూ ఉన్నారని వైఎస్సార్‌సీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. పోలింగ్ బూత్‌లను మార్చడంపై స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని, దీని వలన ఎవరి ఓటు ఎక్కడ ఉందో ఓటరుకి అర్థం కాదన్నారు. తాను ఏ బూతులో ఓటు వేయాలో కూడా ఓటరుకి అర్థం కాని పరిస్థితి వచ్చిందన్నారు. కొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారని ఆరోపించారు. డబ్బులిచ్చి ఓటర్ల స్లిప్పులను వెనక్కు తీసుకుంటున్నారని, ఒకవేళ ఇవ్వకపోతే బెదిరిస్తున్నారని ఆరోపించారు.
నల్లపరెడ్డిపల్లి గ్రామానికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారు. ఆ వచ్చినవారికి ఈ స్లిప్పులను ఇచ్చి దొంగ ఓటు వేయించబోతున్నారని ఆరోపించారు అవినాష్ రెడ్డి. నిరంతరాయంగా దొంగ ఓట్లు వేయటానికి మనుషులను దించారని, దీనిపై మొద్దు నిద్ర వీడి ఎన్నికల కమిషన్ స్పందించాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు.