నూతన శస్త్రచికిత్సా విధానంతో 8 ఏళ్ల‌ బాలుడికి కాలేయ మార్పిడి

year-old boy with new surgical technique. సౌత్‌ ఆసియన్‌ లివర్‌ ఇనిస్టిట్యూట్‌, మణిపాల్‌ హాస్పిటల్స్‌ విజయవాడ

By Medi Samrat  Published on  30 Aug 2022 10:45 AM GMT
నూతన శస్త్రచికిత్సా విధానంతో 8 ఏళ్ల‌ బాలుడికి కాలేయ మార్పిడి

సౌత్‌ ఆసియన్‌ లివర్‌ ఇనిస్టిట్యూట్‌, మణిపాల్‌ హాస్పిటల్స్‌ విజయవాడ మధ్య భాగసామ్యం మరో విజయగాధను లిఖించింది. పుట్టుకతోనే కాలేయ వ్యాధితో బాధపడుతున్న తమ అబ్బాయిని రక్షించుకోవడానికి కాలేయ మార్పిడి తప్ప మరో అవకాశం లేక బాధ‌ప‌డుతున్న‌ కుటుంబంలో సంతోషాన్నీ నింపింది.

పుట్టుకతోనే కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి కాలేయ మార్పిడి చేయవలసి ఉంది. అయితే, అతని కుటుంబంలో తల్లికి మాత్రమే అతనికి దానం చేయగలిగేందుకు అనువైన కాలేయం ఉంది కానీ, ఆమెకు తగిన రీతిలో కాలేయ నిర్మాణం లేదు. చాలామంది ఈ తరహా కేసులలో ఏమీ చేయలేమంటూ తప్పుకుంటారు కానీ.. ప్రొఫెసర్‌ డాక్టర్‌ టామ్‌ చెరియన్‌ నేతృత్వంలోని మణిపాల్‌ హాస్పిటల్స్‌ బృందం మాత్రం శస్త్రచికిత్స విధానంలో చేసే కొద్ది పాటి మార్పులు ఈ సమస్యకు తగిన పరిష్కారం అందించగలదని భావించారు.

ఎనిమిది సంవత్సరాల బాలుడు సుధీర్‌. అతనికి హై సోడియం MELD (model for end-stage liver disease) స్కోర్‌ తో విల్సన్‌ సంబంధిత తుది దశ కాలేయ వ్యాధి సోకింది. ఎదుగుదల పరంగా తీవ్ర లోపాలతో పాటుగా అత్యధిక బిలిరుబిన్‌ కూడా ఉండటం చేత తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడతను. అతని ప్రాణాలు కాపాడాలంటే, అత్యవసరంగా అతనికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. అతని కుటుంబంలో అతనికి తగిన రీతిలో ఉండి దానం చేసే దాతలెవరూ లేకపోయారు.

సీనియర్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ టామ్‌ చెరియన్‌ తో పాటుగా అతని బృందం ఈ సవాల్‌ను స్వీకరించడంతో పాటుగా అతని కుటుంబంలో కాలేయ దానానికి అవకాశాలు కలిగిన ఒకే ఒక్క వ్యక్తిగా అతని తల్లిని గుర్తించారు. కానీ ఆమెకు అతి సంక్లిష్టమైన, అత్యంత అరుదైన కాలేయ నిర్మాణం ఉంది. ఆమె ఒకే ఒక్క విభజించబడని జీర్ణాశయ సిర (పోర్టల్‌ వీన్‌) కలిగి ఉన్నారు. సాధారణంగా కాలేయ దానంకు ఆమె తగిన వ్యక్తి కాదు. అయితే, ప్రొఫెసర్‌ డాక్టర్‌ టామ్‌ చెరియన్‌, తన అత్యున్నత అనుభవం, నైపుణ్యంతో ఈ సవాల్‌ను స్వీకరించి, అత్యంత క్లిష్టమైన పీడియాట్రిక్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీని నూతన విధానంతో చేశారు.

మరీ ముఖ్యంగా ఈ కేసులో.. దాత జీర్ణాశయ సిర నిర్మాణ పరంగా సాధారణంగా ఉండాల్సిన చోట లేదు. అది అసహజమైన రీతిలో వంపు కలిగి ఉంది. దీనికోసం శస్త్రచికిత్స ప్రక్రియను ఈ శరీర నిర్మాణానికి అనువుగా మలచడం జరిగింది. కాలేయంలో ఎడమ భాగాన్ని తొలగించిన తరువాత ఆమె జీర్ణాశయ సిరను ప్రత్యేకంగా సృష్టించిన గ్రాఫ్ట్స్‌తో రోగి వెలుపల పునర్నిర్మాణం చేశారు. ఇదే రీతిలో కాలేయానికి సంబంధించిన నాళాలు కలపడం జరిగింది. కానీ పిత్తవాహిక నాళాలను ముందుగా కలిపిన అనంతరం కాలేయ నాళాలను కలిపారు. సాధారణ కేసులలో ముందు కాలేయ నాళాలను కలిపి అనంతరం పిత్తవాహిక నాళాలను కలుపుతారు.

సౌత్‌ ఆసియన్‌, మణిపాల్‌ హాస్పిటల్‌ బృందంతో పాటుగా స్పెషలిస్ట్‌ నర్సులు, సీనియర్‌ కన్సల్టెంట్లు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌లు, క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్ట్‌లు మరీ ముఖ్యంగా పీడియాట్రిక్‌ టీమ్‌ ఈ బాలుడు కోలుకోవడంలో శ్రమించారు. గత వారమే అతనిని హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ చేశారు.

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడ– హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి మాట్లాడుతూ '' మణిపాల్‌ హాస్పిటల్‌ వద్ద మేము, మా డాక్టర్లు, నర్సులు అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. కాలేయ వ్యాధులు, కాలేయ మార్పిడి చికిత్సలలో అపారమైన అనుభవం కారణంగానే ఈ విజయం సాధించగలిగాము. ప్రొఫెసర్‌ డాక్టర్‌ టామ్‌ చెరియన్‌ ఈ నూతన శస్త్రచికిత్సా విధానం వినియోగించడంతో పాటుగా బాలుని ప్రాణాలు కాపాడారు. తల్లి–కుమారుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా ఆనందంగా జీవితం గడుపుతున్నారు'' అని అన్నారు.


Next Story