చంద్రబాబు ఇలాఖాలో వైసీపీ హవా..!
YCP Win Majority Seats In Kuppam Constituency. కుప్పం నియోజకవర్గంలో..తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ పైచేయి సాధించింది
By Medi Samrat Published on 18 Feb 2021 9:29 AM ISTకుప్పం నియోజకవర్గం.. రాష్ట్రవ్యాప్తంగా ఈ అసెంబ్లీ స్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. దశాబ్దాలుగా టీడీపీ కంచుకోట. అయితే ఇప్పుడా కంచుకోటకు బీటలు వారుతున్నాయా.? అంటే.. అవుననే చెబుతున్నాయి ఎన్నికల సమీకరణాలు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 50వేల మెజార్టీతో గెలుపొందిన చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి నుండి గట్టిపోటీ ఎదుర్కొని 30వేల మెజార్టీకే పరిమితమయ్యారు.
తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ నియోజకవర్గంలో వైసీపీ పైచేయి సాధించింది. 89 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగగా.. వైసీపీ మద్దతుదారులు 74 చోట్ల విజయం సాధించారు. టీడీపీ అభ్యర్ధులు కేవలం 14 పంచాయతీల్లోనే గెలిచారు. కాంగ్రెస్ మద్దతుదారు ఒక పంచాయతీలో విజయం సాధించారు.
ముఖ్యంగా కుప్పం మండలంలో 26 పంచాయతీలకు వైసీపీ మద్దతుదారులు 21, టీడీపీ 5 చోట్ల విజయం సాధించారు. ఇక గుడుపల్లె మండలంలోని 18 పంచాయతీల్లో వైసీపీ 13, టీడీపీ 4, కాంగ్రెస్ ఒక పంచాయతీని కైవసం చేసుకున్నాయి. శాంతిపురం మండలంలో 23 పంచాయతీలకు వైసీపీ 20, టీడీపీ 3 పంచాయతీలు దక్కించుకున్నారు. ఇక రామకుప్పం మండలంలో 22 పంచాయతీలకు గాను వైసీపీ 20 పంచాయతీల్లోను, టీడీపీ మద్దతుదారులు 2 పంచాయతీల్లో గెలుపొంది.. చంద్రబాబు ఇలాఖాలోని అన్ని మండలాల్లో వైసీపీ పైచేయి సాధించింది. దీంతో టీడీపీ శ్రేణులు పార్టీ భవిష్యత్తుపై ఆలోచనలో పడ్డారు.