కుటుంబం జోలికి వస్తే ఎదురు దాడి తప్పదు: విజయసాయిరెడ్డి
YCP MP Vijayasai reddy warns Chandrababu on his comments. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి వైఎస్ విజయమ్మ తప్పుకోవడంపై టీడీపీ నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై
By అంజి Published on 9 July 2022 1:57 PM ISTవైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి వైఎస్ విజయమ్మ తప్పుకోవడంపై టీడీపీ నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా ఇదే విషయమై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థులు ఎలాంటి భాషను వాడితే తాము అదే వాడతామని చెప్పారు.
''అవసరానికి వాడుకుని వైసీపీ నుంచి వదిలివేయడం సీఎం జగన్‌కు అలవాటే. నిన్న చెల్లి, ఇవాళ కన్న తల్లిని బయటకు గెంటేశారు. బాబాయిని ఎవరైనా చంపగలుగుతారా, తల్లి, చెల్లిని ఎవరైనా దూరం చేస్తారా?'' అని నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. బాబు వెన్నుపోటు, లోకేష్ చేసే పనుల గురించి తాము కూడా స్పందించవచ్చని, అయితే వాటి జోలికి తాము పోవడం లేదన్నారు.
''ప్లీనరీ ప్రారంభానికి ముందు, అయిపోయిన తర్వాత కుర్చీలు ఖాళీగా ఉండటం సహజం. టీడీపీ నాయకులు వాటిని చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గౌరవ అధ్యక్ష పదవీ బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకుంటున్నారో విజయమ్మ వివరంగా చెప్పారు. షర్మిలకు సపోర్ట్ కోసమే వెళ్తున్నానని విజయమ్మ చెప్పినా తప్పుడర్థాలు తీస్తున్నారు'' అని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయాలు హుందాగా చేయాలని, ఫ్యామిలీ మెంబర్స్, వ్యక్తిగత ఆరోపణల జోలికి వస్తే అంతకు మించి తాము కూడా మాట్లాడుతామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలు హ్యాపీగా ఉండటం నచ్చదని, ఈ కులాలంటే చంద్రబాబుకు ఈర్ష్య, ద్వేషమని ఆరోపించారు. ఎంతసేపు తన సామాజిక వర్గం మాత్రమే అభివృద్ధి చెందాలని చంద్రబాబు కోరుకుంటాడని విమర్శించారు.
వైసీపీ నేతలపై అసభ్య పదజాలంతో మాట్లాడితే తాము కౌంటర్ ఇస్తున్నామని, ఎప్పుడూ గీత దాటలేదన్నారు. టీడీపీ నేతలు తమ పార్టీ నేతల కుటుంబ, వ్యక్తిగత వ్యవహారల జోలికి వస్తే తాము రెండింతలుగా ప్రతి స్పందిస్తామన్నారు. అసభ్య పదజాలన్నీ, వ్యక్తిగత దూషణలు రాజకీయాల్లో ప్రవేశపెట్టింది లోకేషేనని ఆరోపించారు.