మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని పిలిచింది. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టులో అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణకు ఈరోజు మినహాయింపును ఇవ్వాలని సీబీఐను అవినాశ్ తరపు లాయర్లు కోరారు. వారి విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన సీబీఐ రేపు ఉదయం విచారణకు రావాలని తెలిపింది. ఇక ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలను మధ్యాహ్నం 3.45కి హైకోర్టు వాయిదా వేసింది. అంతకు ముందు బెయిల్ పిటిషన్ పై ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. ఈ నెల 30లోగా విచారణను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, విచారణకు ఎప్పుడు పిలిచినా పిటిషన్లు వేస్తున్నారని సీబీఐ తరపు లాయర్లు వాదించారు. బెయిల్ పై హైకోర్టు నిర్ణయం తర్వాత సీబీఐ విచారణకు అవినాశ్ హాజరవుతారని ఆయన తరపు లాయర్లు చెప్పారు.