అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. తాజాగా వైసీపీకి బిగ్ షాక్ ఇస్తూ.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బీజేపీలో చేరారు. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ థావడే సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వరప్రసాద్‌కు వైసీపీ టికెట్ నిరాకరించింది. ఈ క్రమంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
2014 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి వరప్రసాద్ విజయం సాధించారు. 2019లో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా వరప్రసాద్‌కు తిరుపతి ఎంపీ సీటును బీజేపీ దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. నిన్న జరిగిన సిఈసి సమావేశంలో ఏపీలో 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఆదివారం సాయంత్రం పార్ఠీ తరఫున పోటీ చేసి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది.