ఏపీ అప్పులపై ఆరోపణలు.. ఖండించిన పేర్ని నాని
వైఎస్‌ఆర్‌సీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ని తాకట్టు పెట్టి రూ.10 లక్షల కోట్లు కోట్ల అప్పు చేసిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
By అంజి Published on 3 Jun 2023 1:30 AM GMTఏపీ అప్పులపై వార్తలు.. ఖండించిన పేర్ని నాని
విజయవాడ: వైఎస్‌ఆర్‌సీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ని తాకట్టు పెట్టి రూ.10 లక్షల కోట్లు కోట్ల అప్పు చేసిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపణలను మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య నాని తోసిపుచ్చారు. మే 30, 2019న ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, చంద్రబాబు అప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అప్పు రూ. 2.62 లక్షల కోట్లు అని తెలిపారు. జగన్ ప్రభుత్వం రూ.1.82 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేసిందని మాజీ మంత్రి అన్నారు. ఇక ప్రజల ఖాతాల్లో నేరుగా జమ చేసిన రూ. 2.11 లక్షల కోట్లు అని తెలిపారు. శుక్రవారం ఏపీ ఆవిర్భావ దినోత్సవం అంటూ టీడీపీ అధినేత ప్రజలకు శుభాకాంక్షలు చెప్పడంపై నాని అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నప్పుడు తాను తెలంగాణలో ఉన్నానని నాయుడు అనుకున్నారేమో అని ఆయన అన్నారు. గత నాలుగేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1న ఏపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. సాక్షాత్తూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారని కాంగ్రెస్ హైకమాండ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను దూషిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నాలు చేశారని మాజీ మంత్రి గుర్తు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ విభజనను గట్టిగా సమర్థించిన బీజేపీ గురించి ఆయన ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. పొట్టి శ్రీరాములు పేరు కూడా పలికే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.