జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శలు గుప్పించారు. మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన 10వ ఆవిర్బావ సభలో పవన్ చేసిన కామెంట్స్‌పై పేర్ని నాని స్పందించారు. జనసేన రాజకీయ పార్టీనేనా అని ప్రశ్నించారు. విపక్ష పార్టీలు విడివిడిగా కాదని అందరూ కలిసే రండి అని అన్నారు. అందరూ కలిసి రమ్మనే తాము కోరుకుంటున్నామని, అలా వస్తే 2024 ఎన్నికల్లో ఎవరేంటో తెలుస్తుంది కదా అని అన్నారు. 2014-2019 వరకు జరిపిన పాలనను చూపించి చంద్రబాబు, పవన్ ఓట్లు అడగగలరా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముసుగు తీసేశారని అన్నారు. పవన్ పదే పదే.. కులం, కాపులు, ఓట్లు అని మాట్లాడుతున్నారని.. అందరిని తీసుకెళ్లి చంద్రబాబుకు అప్పజెబుతానని అంటున్నాడని అన్నారు. పవన్ తమను తిడితే.. తాము ఆయనను తిడతామని అన్నారు. చిరంజీవిని కూడా పవన్ కించపరుస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. కొంతమంది పార్టీ పెట్టారు.. మూసేశారు.. తాను మాత్రం అలా కాదని అంటాడు.. 10 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అంటున్నాడని.. మరి యువరాజ్యం అధ్యక్షుడు ఎవరు? అని ప్రశ్నించారు పేర్ని నాని.
"2014లో జనసేన పార్టీ పెట్టేప్పటికీ పవన్ కళ్యాణ్ సొంత అన్న చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నారని.. చిరంజీవిని పరోక్షంగా పార్టీ మూసేశారని కామెంట్ చేశారని.. ఆ పార్టీ మూసేయడానికి మీరంతా కారకులు కాదా? ఓడిపోయిన తర్వాత చిరంజీవిని ఒంటరిగా ఒదిలేసింది ఈ మహానుభావుడు కాదా?’’ అని అడిగారు పేర్ని నాని. జగన్ లాంటి వ్యక్తి కింద పనిచేస్తున్నందుకు తాము కూడ గర్వపడుతుంటామని నాని చెప్పారు.