టీడీపీకి షాక్.. కుప్పంలో చుక్కెదురు
YCP Leads in Kuppam Municipality elections.మున్సిపల్ ఎన్నికల్లోనూ ఫ్యాన్ గాలి వీస్తోంది. తెలుగు దేశం పార్టీ కంచుకోట
By తోట వంశీ కుమార్ Published on 17 Nov 2021 1:06 PM IST
మున్సిపల్ ఎన్నికల్లోనూ ఫ్యాన్ గాలి వీస్తోంది. తెలుగు దేశం పార్టీ కంచుకోట అయిన కుప్పంలో సైతం ఆ పార్టీ పాగా వేసింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ షాక్ తగింది. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి మరీ అధికార వైసీపీ కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. గతంలో జరిగిన పంచాయతీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కుప్పం పరిధిలో టీడీపీకి వైసీపీ షాక్ ఇవ్వగా.. ఇప్పుడు అదే దూకుడును మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించింది.
కుప్పంలో మొత్తం 25 వార్డులు ఉన్నాయి. ఓ వార్డు ఏకగ్రీవం కాగా.. 24 వార్డులకు ఎన్నికలు జరిగాయి. తొలి రౌండ్‌లో 15 వార్డుల కౌంటింగ్ ముగిసింది. ఇప్పటికే ఓ వార్డు ఏకగ్రీవం కాగా.. మిగిలిన వార్డుల్లో లెక్కించారు. మొత్తం 14 వార్డుల్లో వైసీపీ 12, టీడీపీ 2 వార్డులను గెలుచుకున్నాయి. 1,2,3,4,6,7,8,9,10,12,13,15 వార్డుల్లో వైసీపీ విజయం సాధించగా.. 5,11 వార్డుల్లో టీడీపీ గెలిచింది. రెండో రౌండ్‌లో 16 నుంచి 25 వార్డు వరకు కౌంటింగ్ కొనసాగనుంది. మెజార్టీ వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడంతో గెలుపు లాంచనమేనని వైసీపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.
ఇక అనంతపురం జిల్లాలోని పెనుగొండ మున్సిపాలిటీలో కూడా వైసీపీ జెండా ఎగురవేసింది. పెనుగొండలో 20 స్థానాలకు గాను వైసీపీ 18 స్థానాల్లో విజయం సాధించగా.. టీడీపీ ఖాతా తెరవలేదు. అదేవిధంగా ఎనిమిది నగరపంచాయతీల్లో అధికార పార్టీ గెలుపొందింది.