చంద్రబాబు సవాల్ కు 'సిద్ధం' అంటున్న వైసీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 19 Feb 2024 3:52 PM GMTఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే!! అభివృద్ధి పాలన ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో చర్చించేందుకు తాను సిద్ధమని చంద్రబాబు ప్రకటించారు. ఎవరి పాలన స్వర్ణయుగమో.. ఎవరి పాలన రాతి యుగమో.. తేల్చేందుకు తాను సిద్ధమేనన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక, విధ్వంస పాలనపై చర్చించేందుకు నేను సిద్ధం. బూటకపు ప్రసంగాలు కాదు.. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు సిద్ధమా? చర్చకు వచ్చే దమ్ముందా సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఉందా.. అని చంద్రబాబు సవాల్ విసిరారు.
ఈ సవాల్ పై ఏపీ మంత్రి రోజా స్పందించారు. వందలాది హామీలు ఇచ్చి మేనిఫెస్టోను చంకలో దాచేసే చంద్రబాబూ... మీకు ఈ చాలెంజ్ లు ఎందుకు? అని ప్రశ్నించారు. మీలాంటి మోసగాడిని ఇన్నాళ్లు మోయడమే ఎక్కువ. ఇక మీ సేవలు చాలించండి. పోయి మనవడితో ఆడుకోవాలంటూ రోజా ట్వీట్ చేశారు.
ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ.. జగన్ దాకా ఎందుకు... చర్చకు నేను సిద్ధం అంటూ చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. అమరావతిలో సచివాలయం కడితేనే అభివృద్ధి అంటారా? లేక, గ్రామ గ్రామానికి ఓ సచివాలయం కడితే అభివృద్ధి అంటారా? అని ప్రశ్నించారు. ఎటు చూసినా జగన్ చేసిన అభివృద్ధి కనిపించడంలేదా? అని నిలదీశారు. ఆ రోజున ముఖ్యమంత్రిని లొంగదీసుకుని ఈనాడు పేపర్ ద్వారా రామోజీరావు 2 వేల ఎకరాల్లో పెద్ద కోట కట్టుకున్నాడని, ఆ కోటలోంచి రామోజీరావు ఆంధ్రాను చూస్తుంటాడని కేశినేని నాని విమర్శించారు. అందుకే రామోజీ రావు.. చంద్రబాబు చేసిందే అభివృద్ధి అనుకుంటున్నాడు.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 ఆయన, అమెరికాలో ఉంటూ సోషల్ మీడియా పోస్టులు పెట్టే కొందరు కుహనా మేధావులు కూడా ఇంతేనన్నారు. అసలైన అభివృద్ధి పల్లెల్లో ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి పల్లెల్లో నిజమైన అభివృద్ధిని తీసుకొచ్చారని కేశినేని నాని అన్నారు.