లోకేష్ అమిత్ షాను కలవడంపై వైసీపీ నేతల విమర్శలు
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కలిశారు.
By Medi Samrat Published on 12 Oct 2023 2:15 PM GMTఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కలిశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా పురందేశ్వరికి నాలుగు ప్రశ్నలు సంధించారు.
- 'పురంధేశ్వరి గారు! బాబు అవినీతికి శిక్షపడాలి. బాబు అవినీతికి ఆధారాలన్నీ చూపిస్తూ అరెస్టు జరిగింది. బాబు అవినీతిని రాష్ట్ర సీఐడీ, కేంద్ర ఈడీ, కేంద్ర ఐటీ నిర్ధారించాయి. మరి అలాంటప్పుడు బాబుకు మీ మద్దతు అంటే దాని అర్థం ఏమిటి? మీది నేరానికి మద్దతా.. లేక చట్టానికి మద్దతా?
- చంద్రబాబుకు 17–ఏ సెక్షన్ వర్తిస్తుందని.. ఆ సెక్షన్ ప్రకారం గవర్నర్ గారి అనుమతి తీసుకునే అరెస్టు చేయాలని టీడీపీ అధినేత లాయర్లు వాదిస్తున్నారు తప్ప, బాబు ఏ నేరం చేయలేదని.. ఏ విచారణకైనా సిద్ధమని మాట వరసకు కూడా అనటం లేదు!
- ఇలాంటి అవినీతి బాగోతంలో మీరంతా మీ కుటుంబంగా, బాబు జనతా పార్టీగా చంద్రబాబు వైపు నిలబడ్డారు! మరి ఈ అవినీతి బాగోతంలో తాము ఎటువైపు నిలబడాలన్నది భారతీయ జనతా పార్టీ తేల్చుకోవాలి!
- మరో విషయం కూడా.. చంద్రబాబు అవినీతి గురించి, దుర్మార్గాల గురించి మీ భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో రాసిన 'ఒక చరిత్ర కొన్ని నిజాలు' అన్న పుస్తకాన్ని అమిత్ షా గారికి ఇచ్చారా? లేక ఆ పుస్తకం మీద, మీ ఆయన మీద కూడా మీరు, లోకేశ్ కలిసి అమిత్‌షా గారికి ఫిర్యాదు చేశారా? అన్నది కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి!' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ భేటీపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఎవరైనా కలవొచ్చని బొత్స అన్నారు. తమ బాధలను అమిత్ షాకు చెప్పుకునేందుకు లోకేశ్ కలిసి ఉండొచ్చని.. సీఎం జగన్ పై చాడీలు కూడా చెప్పి ఉంటాడని అన్నారు. అమిత్ షా వద్దకు పురందేశ్వరి, లోకేశ్ కలిసి వెళ్లారో, విడివిడిగా వెళ్లారో తమకు అవసరం లేదని అన్నారు. టీడీపీకి రాష్ట్రంలో ఏపీ బీజేపీ బీ టీమ్ అని బొత్స అభివర్ణించారు. బీజేపీకి ప్రతి అంశం చెప్పి చేయాల్సిన అవసరం తమకు లేదని బొత్స స్పష్టం చేశారు. విశాఖకు వెళ్లే అంశంపై తాము జీవో కూడా ఇస్తే, దొడ్డిదారి ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. విశాఖతో పాటు కడపలోనూ సీఎంకు క్యాంపు కార్యాలయం ఉందని తెలిపారు.