వైజాగ్‌, కర్నూలులో కూడా రాజధాని పెట్టొచ్చు: వైసీపీ నేత సజ్జల

తమ హయాంలో ఎలాంటి పరిశ్రమలు ఏపీని విడిచి వెళ్లిపోలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

By -  అంజి
Published on : 12 Sept 2025 2:30 PM IST

YCP, Sajjala Ramakrishna Reddy, AP capital, Amaravati

వైజాగ్‌, కర్నూలులో కూడా రాజధాని పెట్టొచ్చు: వైసీపీ నేత సజ్జల

తమ హయాంలో ఎలాంటి పరిశ్రమలు ఏపీని విడిచి వెళ్లిపోలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇదంతా ఇతర పార్టీలు చేసిన అసత్య ప్రచారం అని వే2 న్యూస్‌ కాన్‌క్లేవ్‌లో కొట్టిపారేశారు. లులూ వెళ్లిపోయిందన్న ఆరోపణలు వినిపించాయని చెప్పడంతో అదేమైనా ఉపాధి కల్పించే ఇండస్ట్రీయా అని ప్రశ్నించారు. కొవిడ్‌ రాకపోయుంటే తాము మరింత మెరుగ్గా పని చేసే వాళ్లమని, మరింత ఆర్థిక వృద్ధి సాధించే వాళ్లమని చెప్పారు. రాజధానిలో ఎవరైనా ఇండస్ట్రీలు కడతారా? అని సజ్జల ప్రశ్నించారు. అమరావతి కోసం చేసిన రూ.లక్షల కోట్ల అప్పు ఎలా తీరుస్తారని ఆయన ప్రశ్నించారు.

కేంద్రం నుంచి ఎంత డబ్బు తీసుకువచ్చి అయినా రాజధాని కడితే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. కానీ రూ.లక్ష కోట్లు ఇప్పటికే రాజధాని పేరుతో వృథా చేశారని, వైజాగ్‌, కర్నూలు, విజయవాడలో కూడా రాజధాని పెట్టొచ్చని సజ్జల వ్యాఖ్యానించారు. రాజధానిలో ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ చాలు అని, కొత్త కట్టడాలేమీ అవసరం లేదని సజ్జల అన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని, గత ప్రభుత్వ పాలన అక్కడి నుంచే నడిచిందని వివరించారు. విశాఖ నుంచి పాలన చేద్దామని జగన్‌ అనుకున్నారని, అయితే ఎన్నికలు రావడంతో అది కుదరలేదని చెప్పారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే విశాఖతో పాటు అమరావతి కూడా అభివృద్ధి అయ్యేదని చెప్పారు.

Next Story