ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా వరల్డ్ బ్యాంక్ తీపికబురు తెలిపింది. అమరావతి నిర్మాణాల కోసం ఇంతకుముందే వరల్డ్ బ్యాంకు రూ.6,700 కోట్లు రిలీజ్ చేసింది. తాజాగా మొదటి విడత రుణంగా రూ.3,535 కోట్లు విడుదల చేసింది. కాగా ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్‌లో క్రెడిట్ కానున్నాయి.
అయితే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణాలను సొంత నిధులతో స్టార్ట్ చేసింది. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ రిలీజ్ చేయడంతో త్వరలోనే ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఏడీబీ రూ.6700 కోట్ల రుణం మంజూరు చేసిన విషయం విదితమే. దీంతో ఈ రెండు బ్యాంకుల నుంచి దాదాపు రూ.13,600 కోట్లు రుణ రూపేనా అందుతుండగా..అదనంగా రూ.1,400 కోట్లు కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సహాయంగా అందిస్తోంది.
మరో వైపు హడ్కో నుంచి రూ.11 వేల కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన పర్మిషన్ లెటర్ కూడా రాష్ట్రానికి అందింది. జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరొక రూ.5 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.