ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. గత కొన్ని రోజులుగా అటవీ సరిహద్దు గ్రామాల్లో పులి తిరుగుతూ ఉంది. తెలంగాణలోని కావడిగుండ్ల అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కావడిగుండ్ల పరిధిలో ఇప్పటికే ఒక లేగదూడపై దాడి చేసి చంపిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పులి ఏలూరు జిల్లాలోని పందిరిమామిడిగూడెం పరిసరాల్లో తలదాచుకున్నట్లుగా తెలుస్తోంది. పందిరిమామిడిగూడెం, ఇనుమూరు, గాడిదబోరు, అంతర్వేదిగూడెం గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలెవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో పొలాల వద్దకు వెళ్లడం మానుకోవాలని హెచ్చరించారు.