ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సీఎం చంద్రబాబుని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కోరారు. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం నితీశ్ తీర్మానం చేసి మోదీ ముందట డిమాండ్ పెడితే ఏపీకి హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదన్నారు. కేంద్రంలో కింగ్ మేకర్‌గా ఉన్నా హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గం అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
''రాజధాని లేని రాష్ట్రంగా బిహార్ కంటే వెనుకబడి ఉన్నామని మీకు తెలియదా? 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తులేదా? రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా? హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదు? మోసం చేసిన మోదీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు'' అని సీఎం చంద్రబాబును షర్మిల నిలదీశారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని చంద్రబాబు ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని షర్మిల అన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు కాదు.. రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని గుర్తు చేస్తున్నామన్నారు.