ఎవరిని అడిగినా.. వచ్చేది సైకిలే అంటున్నారు: టీడీపీ నేత
యువత, మహిళలు, రైతులను.. ఎవరినీ అడిగినా సైకిల్ రావాలి అంటున్నారని, వచ్చేది కూడా సైకిలే అంటున్నారని టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు.
By అంజి Published on 11 Feb 2024 11:03 AM GMTఎవరిని అడిగినా.. వచ్చేది సైకిలే అంటున్నారు: టీడీపీ నేత
యువత, మహిళలు, రైతులను.. ఎవరినీ అడిగినా సైకిల్ రావాలి అంటున్నారని, వచ్చేది కూడా సైకిలే అంటున్నారని టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. పలాస శంఖారావం సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. చాలా రోజుల తర్వాత ప్రజల్లో పౌరుషం చూస్తున్నానన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు మోసపోయారని అన్నారు. సీఎం జగన్ అనేక పాపాలు చేశారని ఆరోపించారు. యువతకు 2.30 లక్షల ఉద్యోగాలు లేవు, జాబ్ కేలండర్ లేదు, తాజాగా దగా డీఎస్సీ ప్రకటించారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత విరుచుకుపడ్డారు. సీఎం జగన్ ఎక్కడైనా కనిపిస్తున్నారా? అని ప్రజలను ప్రశ్నించారు. పరదాలు కట్టుకుని, చెట్లు కొట్టి దొంగ చాటుగా వెళ్లే వ్యక్తి జగన్ రెడ్డి అని విమర్శించారు.
పలాస మెయిన్ రోడ్డులో తట్ట మట్టి కూడా వేయని వ్యక్తి అప్పలరాజు అని, అడుగడుగునా అవినీతి చేసి పలాస పరువు తీశారని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. స్టీల్ కుర్చీల నుంచి స్టీల్ ప్లాంట్ వరకు తానే ఎంపీనని అప్పల్రాజుకు చెబుతున్నానన్నారు. ''వైసీపీ ఎంపీలు ఎవరో ప్రజలకు తెలుసా? బాబాయి హత్య ఎవరు చేశారో ప్రజలు అందరికీ తెలుసు. విశాఖలో భూకబ్జాలు చేసిన ఎంపీ ఎవరో ప్రజలందరికీ తెలుసు. అశ్లీలంగా వీడియోలు తీయడం, రీల్స్ చేయడం తప్ప వైసిపి ఎంపీలు చేసింది శూన్యం. సోషల్ మీడియాలో తప్ప కిడ్నీ ఆసుపత్రి ఎవరికీ ఉపయోగపడటం లేదు'' అని రామ్మోహన్ నాయుడు అన్నారు.
''ఎన్నికలకు ముందు ఫోటోలు దిగడానికి తప్ప పేషెంట్లకు ఉపయోగపడని కిడ్నీ సెంటర్ పెట్టారు మంత్రి అప్పలరాజు, అక్కడ నెఫ్రాలజిస్ట్ లేరు. పబ్లిసిటీ కోసమే బిల్డింగులు కట్టి ఓట్లు అడగడానికి వస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి'' ప్రజలకు టీడీపీ నేత సూచించారు. ''ఉద్దాన ప్రాంతానికి మొట్టమొదటి ఎర్రన్నాయుడు నీళ్లిచ్చారు, ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా నిధుల్లేవు. లోకేష్ మంత్రిగా ఉన్నపుడు సుజల స్రవంతి పెట్టి తాగునీటి పథకాలను ఏర్పాటు చేశారు. కక్షసాధింపు చర్యలకు, భూకబ్జాలకు తప్ప మరో అభివృద్ధి పనికి ప్రాధాన్యత ఇవ్వని వారు ప్రస్తుతం పలాస ఎమ్మెల్యేగా ఉన్నారు. తిత్లీ తుపాను వచ్చినపుడు పొరుగున పర్యటిస్తూ ఇక్కడకు రాని మనసులేని వ్యక్తి జగన్'' అని రామ్మోహన్ నాయుడు అన్నారు.