కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఏపీ ప్రత్యేక హోదాపై తొలి సంతకం: షర్మిల
ఏపీ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పదేళ్ల ప్రత్యేక హోదాపై తొలి సంతకం ఉంటుందనన్నారు.
By అంజి Published on 19 April 2024 9:35 AM ISTకాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఏపీ ప్రత్యేక హోదాపై తొలి సంతకం: షర్మిల
శింగనమల, ఉరవకొండ నియోజకగవర్గాల్లో ఏపీ న్యాయ యాత్రకు.. మండుటెండలను సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. మహానేత వైఎస్సార్ రాయలసీమను సస్యశ్యామలం చేయాలనుకున్నారని వైఎస్ షర్మిల అన్నారు. హంద్రీనీవా వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ అని, అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్ట్‌ను ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్న జగనన్నకు.. అధికారంలోకి వచ్చాక పూర్తి చేయడం చేతకాలేదన్నారు. రైతులను జగన్ నిండా ముంచారని ఆరోపించారు. వైఎస్సార్ హయంలో వ్యవసాయం పండుగ అని, అదే జగన్ హయంలో అప్పు లేని రైతు లేనే లేడు అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పదేళ్ల ప్రత్యేక హోదాపై తొలి సంతకం ఉంటుందనన్నారు. తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డనని.. ఆయన ఆశయం సాధనలో మడమ తిప్పే ప్రసక్తే లేదు అని వైఎస్ షర్మిల తెలిపారు.
అంతకుముందు ఏపీ న్యాయ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా మడకశిరలో వైఎస్ షర్మిల పర్యటించారు. హంద్రీనీవా ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 90శాతం పూర్తి అయితే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు కానీ ఇప్పుడున్న జగన్ కానీ మిగిలిన 10శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారని షర్మిల మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగు నీరు ఇస్తామన్న హామీ ఏమైంది జగన్ ? అంటూ ప్రశ్నించారు. ఇండస్ట్రీయల్ కారిడార్ అన్నారు ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. రఘువీరారెడ్డి హయాంలో భూ సేకరణ జరిగింది, కానీ ఇంతవరకు పరిశ్రమలు మాత్రం రాలేదని అన్నారు. లెదర్ పార్క్ అన్నారు మరిచారు. మడకశిర నియోజకవర్గం చుట్టూ రింగ్ రోడ్డు అన్నారు మరిచారు. ఈ పదేళ్ల పాలనలో టీడీపీ, వైసీపీ ప్రజలను మోసం చేశాయే తప్ప అభివృద్ధి చేసింది శూన్యం అని షర్మిల ఎత్తి చూపారు.